
ఉచిత అన్నప్రసాదానికి విరాళాల వెల్లువ
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో నిత్యం జరిగే ఉచిత అన్నప్రసాద పథకానికి విరాళాలు వెల్లువలా వచ్చాయి. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడికి చెందిన వీవీ రామప్రసాద్ దంపతులు, వారి కుటుంబసభ్యులు జ్యోతిర్మయి, ప్రథమ కుమారుడు తిరుమలేష్, మనస్విని దంపతులు, ద్వితీయ కుమారుడు సాయి తేజేష్ రూ.1,01,116 విరాళంగా సమర్పించారు. ఈ మొత్తాన్ని ఆలయ ఈఓ శీనా నాయక్‌కు అందజేశారు.
శ్రీదుర్గా భవానీ ధర్మ ప్రచార పరిషత్ పక్షాన..
అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి శ్రీదుర్గా భవానీ ధర్మ ప్రచార పరిషత్ పక్షాన విజయవాడ సుందరయ్యనగర్‌కు చెందిన దారపు వెంకట రామ ప్రసాద్, ఇందుమతి దంపతులు, వారి తల్లిదండ్రులు దారపు కేశవరావు–లక్ష్మీకాంతమ్మ దంపతులు, మామ చింతల వెంకటేశ్వరరావు–నాగమణి దంపతుల పేరిట రూ.1,00,116 విరాళాన్ని ఆలయ అధికారికి అందజేశారు.
విస్సన్నపేట వాస్తవ్యుల విరాళం రూ.1,00,116
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలోని దుర్గమ్మ దేవాలయం సమీపంలో నివసిస్తున్న గణపవరపు ఉమాదేవి, వెంకట విజయ రామసాయి దంపతులు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116 విరాళంగా అందజేశారు. దాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.

ఉచిత అన్నప్రసాదానికి విరాళాల వెల్లువ