హనుమాన్‌జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఈదులగూడెం రోడ్డులో ఉన్న మహిషమ్మ తల్లి దేవస్థానంలో బుధవారం అర్థరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. గ్రామ శివారులో మామిడి తోటల మధ్య నిర్మానుష్య ప్రాంతంలో ఆలయం ఉండటంతో రాత్రివేళ దొంగలు సులువుగా దోపిడీ చేశారు. ఆలయ ప్రధాన ద్వారం తాళం ధ్వంసం చేసి గర్భగుడిలోకి ప్రవేశించిన దుండగులు హుండీ అపహరించుకుపోయారు. ఆలయ వెనుక ప్రాంగణంలో హుండీని ధ్వంసం చేసి అందులోని నగదు తీసుకుని పరారయ్యారు. ఆలయ గర్భగుడిలో బీరువాలో భద్రపర్చిన అమ్మవారి నూతన వస్త్రాలు, ఇతర ఆభరణాలను కూడా దుండగులు అపహరించారు. ముఖానికి మాస్క్‌లు ధరించిన ఇద్దరు యువకులు ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి హుండీ అపహరించటం, బీరువా ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. గురువారం ఉదయం ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వీరవల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై వీరవల్లి ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్ విచారణ చేపట్టారు.