నందిగామ టౌన్: కూటమి పాలనలో జైళ్లకు హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ ఎన్నికల సందర్భంగా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై ఇష్టానుసారం అక్రమ కేసులు మోపుతూ ఇబ్బంది పెడుతున్నారని, వారితో జైళ్లను నింపేస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో చర్యకు ప్రతిచర్య తప్పక ఉంటుందన్నారు.
మాయ మాటలతో అధికారం
మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కూటమి తొమ్మిది నెలల పాలనలో సూపర్ సిక్స్‌లో ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అరుణకుమార్ మండిపడ్డారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లని చెప్పి ఏడాది ఒక్క సిలిండర్‌తో సరిపెట్టారని ఎద్దేవాచేశారు. అసలు సూపర్ సిక్స్ హామీ ఏమైందో ప్రజలకు అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. వంద పడకల ఆస్పత్రిని ప్రస్తుత ఆస్పత్రి స్థలంలో నిర్మించి నందిగామ భవిష్యత్తును కాలరాయొద్దని సూచించారు. వంద పడకల నిర్మాణం పేరుతో ఇప్పుడు ఆస్పత్రిని కూల్చి మాజీ మంత్రి దేవినేని వెంకట రమణ జ్ఞాపకాలను చెరిపివేసేందుకు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వ ధరకు భూమి ఇవ్వటానికి ముందుకొచ్చిన రైతులను అవినీతిపరులుగా చిత్రీకరించేందుకు కూటమి నేతలు యత్నిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలకు మేలు చేయాలి
ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మేలు చేయాలే తప్ప కీడు తలపెట్టకూడదని అరుణకుమార్ పేర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ అభివృద్ధిపై కాకుండా ఏవేవో విషయాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారని, వంద పడకల ఆస్పత్రి తామే తీసుకువచ్చామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. వాస్తవాలు అన్నీ ప్రజలకు తెలుసని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు గాదెల వెంకటేశ్వరరావు, ఎంపీపీ రమాదేవి, మంచాల చంద్ర శేఖర్, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అరుణకుమార్