కదం తొక్కిన నిరుద్యోగులు
అవనిగడ్డ వంతెన సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులు
అవనిగడ్డ: మెగా డీఎస్సీని వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని నినదించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ వంతెన సెంటర్‌లో మంగళవారం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వందలాది మంది అభ్యర్థులు రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో కిలో మీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.
భారీ ర్యాలీ.. ధర్నా..
అవనిగడ్డ గ్రంథాలయం నుంచి వంతెన సెంటర్ వరకూ భారీ ర్యాలీ చేశారు. అనంతరం వంతెన సెంటర్‌లో ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. మానవహారం నిర్వహించారు. ‘సీఎం చేసిన మొదటి సంతకాన్ని అమలు చేయాలి, ప్రభుత్వం ఆమోదించిన 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి, పది లక్షల మంది డీఎస్సీ నిరుద్యోగులకు న్యాయం చేయాలి, తొలి సంతకం చేసిన డీఎస్సీ ఎక్కడ?, చంద్రన్నా.. మెగా డీఎస్సీ ఏదన్నా, జీవో 117ని రద్దు చేయాలి, ప్రశ్నించే పవన్‌కల్యాణ్ ఎక్కడ?’ అంటూ నినాదాలు చేశారు. పలు డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు.
ప్రశ్నిస్తానన్న పవన్‌కల్యాణ్ ఎక్కడ?
ఎన్నికల ముందు సభలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ఇస్తామని, లేదంటే అభ్యర్థుల తరఫున తానే ప్రశ్నిస్తానని చెప్పిన డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడ? అని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న ప్రశ్నించారు. డీఎస్సీ ఇవ్వక పోవడం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర మనోవేదన పడుతున్నారని, ప్రశ్నించడానికే పుట్టానని చెప్పుకునే పవన్‌కల్యాణ్ నోరు ఎందుకు మూగబోయిందో చెప్పాలన్నారు. యువతను తప్పుదోవ పట్టించేలా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ నీచమైన రాజకీయాలకు పవన్‌కల్యాణ్ తెరతీశారని విమర్శించారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో రహదారిపై బైఠాయింపు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్