పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అజెండాకు మొత్తం 230 అంశాలు రాగా.. అందులో 197 అంశాలను సభ్యులు ఆమోదిస్తూ తీర్మానం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని 9 అంశాలు, ఆఫీస్ రిమార్కుకు 8, ప్రత్యేక కమిటీల సిఫార్సుకు 6, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తూ 3, ర్యాటిఫై చేస్తూ ఒక అంశం, ముందస్తు అనుమతి లేకుండా అదనపు ఖర్చును 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఖర్చు చేయాలని, జాతీయ రహదారి విభాగానికి సిఫార్సు చేయాలని రెండు ప్రతిపాదనలను సభ్యులు తీర్మానించారు.
‘శాప్’ చేతిలోకి ఇందిరాగాంధీ స్టేడియం..
విజయవాడ నగరపాలక సంస్థ ఆధీనంలో ఉన్న ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియాన్ని ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్‌కు) అప్పగించేందుకు వీఎంసీ కౌన్సిల్ తీర్మానించింది. దీనిపై చర్చ చేయాలని వచ్చిన ప్రతిపాదనపై సభ్యులు మాట్లాడుతూ ఎంతకాలం అజమాయిషీ ఇవ్వాలి ? తిరిగి కార్పొరేషన్‌కు ఎప్పుడు అప్పగిస్తారు? అనే దానిపై సరైన స్పష్టత లేదని.. దీనిపై నిబంధనలను రూపొందించాలని కమిషనర్‌కు సూచించారు.
కఠినంగా వ్యవహరించొద్దు..
పన్నుల వసూళ్లలో వీఎంసీ రెవెన్యూ సిబ్బంది పన్ను చెల్లింపుదారులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని, పన్నులు చెల్లింకపోతే యూజీడీ పైపులైను, తాగునీటి పైపులైన్లు తొలగిస్తున్నారని కార్పొరేటర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది ఎన్నికలు, వరదల కారణంగా పన్నుల వసూళ్లలో కాస్త నెమ్మదించిందని, పన్నుల వసూళ్లలో సిబ్బందికి టార్కెట్లు విధించామని కౌన్సిల్‌కు స్పష్టం చేశారు. దీనిపై కార్పొరేటర్లు స్పందిస్తూ మౌలిక వసతులు కల్పించలేని వీఎంసీ అధికారులు బలవంతంగా కనెక్షన్లను తొలగించటంపై అభ్యంతరం చేయటంతో కమిషనర్ పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
స్ట్రీట్ వెండర్ల కమిటీపై దుమారం
నగరంలోని వీధి విక్రయదారుల క్రమబద్ధీకరణకు కౌన్సిల్ ఆధ్వర్యంలో 19 మంది సభ్యులతో కమిషనర్ చైర్మన్‌గా, పట్టణ ప్రణాళిక విభాగం, ప్రజారోగ్య విభాగం, పీవో యూసీడీ, ట్రాఫిక్ డీసీపీ, బ్యాంకర్, అడ్వకేట్ శాశ్వత సభ్యులుగా వివిధ రకాల వీధి విక్రయదారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఒక ఎన్‌జీవో, ఒక కమ్యునిటీ ఆర్గనైజర్‌లు రొటేషన్ విధానంలో కమిటీ ఏర్పాటు చేయాలని వచ్చిన ప్రతిపాదనపై కార్పొరేటర్‌లు తొలుత అభ్యంతరం తెలిపారు. కమిటీలో కార్పొరేటర్లందరినీ భాగస్వామ్యం చేయాలని సభకు సూచించారు.
‘సాక్షి’పై అక్కసు..
15వ డివిజన్‌లో రామలింగేశ్వర కట్టపై రేయింబవళ్లు ఇసుక లారీలు తిరగటంతో రోడ్డుకింద ఉన్న పైపులైన్లు పగిలిపోతున్నాయని, వాహనాల వేగంతో ఇప్పటికే ముగ్గురు కూడా చనిపోయారని దీనిపై చర్యలు తీసుకోవాలని డెప్యూటీ మేయర్ బెల్లందుర్గ సమస్యపై ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదనలో ‘సాక్షి’ పత్రికలో కూడా వార్త వచ్చిందని ఉండటంతో టీడీపీ కార్పొరేటర్లు చర్చను పక్కదారి పట్టేలా వ్యవహరించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’పై అక్కసుకు వెళ్లగక్కుతూ పత్రికలో వచ్చిన వార్తలు ప్రతిపాదన ఎలా పెడతారని టీడీపీ కార్పొరేటర్లు అభ్యంతరం చెప్పారు. టీడీపీకి ప్రజల సమస్యల కంటే కూడా సాక్షి పత్రికపైనే అక్కసు ఉందని, సమస్య పరిష్కారానికి నియోజకవర్గం స్థాయి నేతల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని బెల్లం దుర్గ పట్టుబట్టారు.
తీర్మానించిన వీఎంసీ కౌన్సిల్ స్ట్రీట్ వెండింగ్ కమిటీకి ఆమోదం ఎద్దడి లేకుండా తాగునీటి సరఫరా చేయాలని నిర్ణయం పన్ను వసూళ్లలో కఠినంగా వ్యవహరించొద్దని సూచన
తాగునీటి ఎద్దడిపై సుదీర్ఘ చర్చ
నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రిజర్వాయర్ల నుంచి వచ్చే పైపులైన్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని, మరమ్మతుల పేరుతో మూడు సర్కిళ్ల పరిధిలో పలు ప్రాంతాల్లో తరచూ నీటి సరఫరా నిలిపేస్తున్నారని సభ్యులు ప్రశ్నించారు. ప్రధానంగా కొండ, శివారు ప్రాంతాల్లో నీటి సరఫరా అంతంత మాత్రంగా జరుగుతుందని సభ దృష్టికి తీసుకురాగా.. అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదు. రిజర్వాయర్‌ల నీటిమట్టం తెలుసుకునేందుకు ప్రత్యేక విభాగం ఉందని, ఇప్పుడు అది పనిచేయటంలేదని, పైపులైన్ల రూటుమ్యాపు కూడా అందుబాటులో లేకపోవటంతో ఎక్కడపడితే అక్కడ రోడ్డును తవ్వేసి వదిలేస్తున్నారని కార్పొరేటర్లు వివరించారు.
స్టేడియంపై ఇక ‘శాప్’ పెత్తనమే!