గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కారవేదిక (పీజీఆర్‌ఎస్)కు వస్తున్న అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. అర్జీదారుల సమస్య లపై అధికారులు సానుకూలంగా స్పందించాలని సూచించారు. కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్‌ఎస్ జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌లో సమోదవుతున్న అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికా రులపై ఉందన్నారు. అర్జీలు ఏ స్థాయిలోనూ పెండింగ్ ఉండకూడదని స్పష్టంచేశారు. సమస్య పరిష్కారమైన అర్జీదారుల సంతృప్తి స్థాయిని ఐవీఆర్‌ఎస్ ద్వారా ఉన్నతాధికారులు తెలుసుకుంటా రని పేర్కొన్నారు. అవసరమైతే సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగా వెళ్లి అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ వేయాలన్నారు. తొలుత కలెక్టర్ లక్ష్మీశ పీజీఆర్‌ఎస్ దరఖాస్తులపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు.
రెవెన్యూ అర్జీలే అధికం
పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి ప్రజల నుంచి 133 అర్జీలు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికం 41 అర్జీలు అందాయి. శాఖల వారీగా పోలీస్ 21, మునిసిపల్ 17, పంచాయతీ రాజ్ 11, డీఆర్డీఏ ఆరు, ఉపాధి కల్పన ఆరు, సర్వే ఐదు, సహకార సంఘం నాలుగు, పౌరసరఫరాలు మూడు చొప్పున అర్జీలు అందాయి. మిగిలిన అర్జీలు ఏపీసీపీడీసీఎల్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, పశుసంవర్ధక శాఖ, వ్యవసాయం, వాణిజ్య పనులు, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్, నైపుణ్య అభివృద్ధి, మార్కెటింగ్, బీసీ కార్పొరేషన్, మత్స్యశాఖ, విద్య, ఖజానా శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, గ్రామ/వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి జి.జ్యోతి, ఏసీపీ కె.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశాలు పీజీఆర్‌ఎస్‌కు 133 అర్జీలు
సమస్యలపై సానుకూలంగా స్పందించాలి