గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజలకు నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా సూచించారు. విజయవాడ గవర్నర్‌పేట రైతు శిక్షణ కేంద్రం సమావేశ మందిరంలో శుక్రవారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయం ఆధ్వర్యంలో రెవెన్యూ సేవల పంపిణీపై అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్‌డీవోలకు శిక్షణ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, సీసీఎల్‌ఏ జి.జయలక్ష్మి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ సేవలు అందించడంతోపాటు ఏవైనా సమస్యలు ఎదురైతే వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం తదితరాలపై మార్గనిర్దేశం చేశారు. రెవెన్యూ అంశాలకు సంబంధించి వచ్చే ఆరు నెలల సమయం చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఎక్కడా జాప్యం లేకుండా రోజువారీ కార్యకలాపాలు నిర్వహించేందుకు, డేటా నమోదులో కచ్చితత్వానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ల్యాండ్ ఎన్ క్రోచ్ మెంట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కచ్చితంగా అమలు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పేపర్ లెస్, స్మార్ట్ గవర్నన్స్ అందించాలన్నారు. రీసర్వేపై సర్వే సెటిల్‌మెంట్, భూ రికార్డుల డైరెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ఇనామ్, ఎస్టేట్, పీవోటీ చట్టాలపై విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ లక్ష్మీ నరసింహం, రికార్డ్ ఆఫ్ రైట్స్, భూ ఆక్రమణలు, ల్యాండ్ గ్రాబింగ్‌పై విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.రామయ్య శిక్షణ ఇవ్వగా.. వెబ్‌ల్యాండ్ సంబంధిత అంశాలపై ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.రచన వివరించారు. వివిధ సందేహాలను నివృత్తి చేశారు.
శిక్షణ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా