మంచి ఉపాధి అవకాశాలు చూపే కోర్సులు, కళాశాలలే టార్గెట్‌ | - | Sakshi
Sakshi News home page

మంచి ఉపాధి అవకాశాలు చూపే కోర్సులు, కళాశాలలే టార్గెట్‌

Published Mon, Mar 17 2025 10:44 AM | Last Updated on Mon, Mar 17 2025 10:44 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ముగిశాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులకు ఎక్కడ చేర్పిస్తే బాగుంటుంది? ఏది చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది? ఏ కోర్సు చేస్తే ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయి? అనే అంశాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్‌ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులంతా దాదాపు ఇదే ఆలోచనల్లో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే పలువురు విజయవాడకు సమీపంలో ఉన్న ప్రైవేటు విశ్వ విద్యాలయాలను సందర్శించడంతో పాటు, ఆయా యూనివర్సిటీలు అడ్మిషన్స్‌ కోసం నిర్వహించే పరీక్షల వివరాలు, ఫీజుల వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.

ప్లేస్‌మెంట్స్‌కే ప్రాధాన్యం..

ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ రంగం మందకొడిగా నడుస్తోంది. అధిక నైపుణ్యం ఉన్న విద్యార్థులే ప్లేస్‌మెంట్స్‌ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మంచి ఆఫర్లు ఏ కళాశాల, యూనివర్సిటీల్లో ఎక్కువ వస్తున్నాయో తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు. అంతేకాక ఇంజినీరింగ్‌, డిగ్రీలో ఏ కోర్సులు చేసిన వారికి ప్లేస్‌మెంట్స్‌ వస్తున్నాయో కూడా తెలుసుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగానే ప్రైవేటు విశ్వ విద్యాలయాలు, కళాశాలలు తమ వద్ద చేరితే వంద శాతం ప్లేస్‌మెంట్స్‌ వస్తాయి.. ఈ విద్యా సంవత్సరంలో ఇంత మంది ప్లేస్‌మెంట్‌ పొందారంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటర్మీడియెట్‌ పరీక్ష కేంద్రాల వద్ద సైతం అదే తరహా కరపత్రాలను యూనివర్సిటీ, కళాశాలల యాజమాన్యాలు పంపిణీ చేశారు.

డిగ్రీకి పెరిగిన క్రేజ్‌..

ప్రస్తుతం డిగ్రీలోని పలు కోర్సులకు క్రేజ్‌ పెరిగింది. వాటిలో బీబీఏతో పాటు, బీఎస్సీ కంప్యూటర్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి వాటిపై విద్యార్థులు దృష్టి పెడుతున్నారు. ఆయా కోర్సులు చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తుండటంతో డిగ్రీ కాలేజీల్లో ఆ కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వాటితో పాటు సివిల్స్‌, గ్రూప్‌–1, గ్రూప్‌–2 వంటి ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి పెట్టిన వారు బీఏలో చేరుతున్నారు. ఇప్పుడు డిగ్రీతో పాటు, సివిల్స్‌, గ్రూప్స్‌లో శిక్షణ ఇచ్చే కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో బీఏలో చేరే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.

ముగిసిన ఇంటర్మీడియెట్‌ పరీక్షలు

విద్యార్థుల ఉన్నత చదువులపై

దృష్టిసారిస్తున్న తల్లిదండ్రులు

డిగ్రీ, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో అవకాశాలు వేటిలో ఎక్కువుంటాయంటూ ఆరా

ప్రైవేటు యూనివర్సిటీలు, కళాశాలల

వివరాలు తెలుసుకుంటున్న వైనం

పేరెంట్స్‌కు ఫోన్‌లు చేస్తున్న ప్రైవేటు

కళాశాలల పీఆర్‌ఓలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement