స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ తరగతులు
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 2వ తేదీ నుంచి తమ సంస్థ ఆధ్వర్యంలో వివిధ స్వయం ఉపాధి కోర్సులో శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఏ.పూర్ణిమ ఓ ప్రకటనలో తెలిపారు. కట్టింగ్ అండ్ టైలరింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ఎలక్ట్రీకల్ టెక్నీషియన్ హెల్పర్, ఎయిర్ కండిషనర్ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిజం, మెషిన్ ఎంబ్రాయిడరీ, డ్రస్ డిజైనింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మిర్రర్ వర్క్, హోమ్ క్రాప్ట్స్, జామ్ అండ్ జ్యూస్ మేకింగ్, స్మాకింగ్ అంశాల్లో శిక్షణా తరగతులను నిర్వహిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు విజయవాడ మొగల్రాజపురం రావిచెట్టు సెంటర్ సమీపంలో ఉన్న తమ సంస్థ కార్యాలయంలో లేదా 0866–2470420 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో
మాజీ సర్పంచ్ మృతి
కాచవరం(ఇబ్రహీంపట్నం): కాచవరం గ్రామ మాజీ సర్పంచ్ మొండితోక వెంకటరత్నం(55) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాచవరం గ్రామంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన వెంకటరత్నం తన వ్యక్తిగత పనులపై సమీపంలోని దొనబండ గ్రామానికి తన బైక్‌పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కాచవరం చేరుకుని డివైడర్ వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. ఈప్రమాదంలో లారీ చక్రాలు వెంకటరత్నం మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 2006 – 2011 మధ్య కాలంలో గ్రామానికి సర్పంచ్‌గా వ్యవహరించారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో ఏర్పడిన ఇందిరమ్మ కాలనీకి రూపరేఖలు తెచ్చారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పీజీ వైద్య ఫలితాల్లో స్టేట్ ఫస్ట్
అవనిగడ్డ: పీజీ వైద్య ఫలితాల్లో అవనిగడ్డకు చెందిన కూనపరెడ్డి లాస్యకృష్ణ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్ధానం సాధించింది. మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాలలో మాస్టర్ ఆఫ్ సర్జన్(ఈఎన్‌టీ) విభాగంలో 800 మార్కులకు 585 మార్కులు సాధించింది. 2014–20లో పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివిన లాస్యకృష్ణ పీజీ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ సాధించడం చాలా ఆనందంగా ఉందని తల్లిదండ్రులు కూనపరెడ్డి బాలరమేష్‌బాబు, సరోజ చెప్పారు. తండ్రి రిటైర్డ్ ఉపాధ్యాయుడు కాగా, తల్లి సరోజ ప్రస్తుతం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. స్టేట్‌ఫస్ట్ సాధించిన లాస్యకృష్ణకు పలువురు అభినందనలు తెలిపారు.
స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ తరగతులు


