ఆర్టీసీ బస్సు ఢీకొని కండక్టర్ దుర్మరణం
కృష్ణలంక(విజయవాడతూర్పు): విధుల్లో ఉన్న కండక్టర్‌ను అదే బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని వారధి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తెలంగాణ ఆర్టీసీ బస్సుకు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలం, గంగారం గ్రామానికి చెందిన వజ్జ అభిలాష్(40) కండక్టర్‌గాను, ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలానికి చెందిన తప్పిట ప్రకాశం డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. అభిలాష్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగళవారం అభిలాష్, ప్రకాశం ఇద్దరూ భద్రాచలం బస్సుకు డ్యూటీ ఎక్కి భద్రాచలంలో ప్రయాణికులను ఎక్కించుకుని గుంటూరు వెళ్లారు. తిరిగి అక్కడ ప్రయాణికులను ఎక్కించుకుని భద్రాచలం బయలుదేరారు. రాత్రి 10.15 గంటల సమయంలో వారధి దాటి వై.జంక్షన్ నుంచి బస్టాండ్ వైపునకు వెళ్లాల్సిన బస్సు వారధి ప్లైఓవర్‌పై 300 మీటర్లు ముందుకు వెళ్లింది. అది గమనించిన డ్రైవర్ బస్టాండ్‌కు వెళ్లేందుకు నిమిత్తం బస్సును రివర్స్ చేసే క్రమంలో కండక్టర్ బస్సు దిగి వెనుకకు వెళ్లి డ్రైవర్‌కు సిగ్నల్ ఇస్తున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఆ బస్సు కండక్టర్‌ను ఢీ కొట్టి తలపైకి ఎక్కడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు అవినాష్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


