సిద్ధార్థ వైద్య విద్యార్ధుల అద్భుత ప్రతిభ
లబ్బీపేట(విజయవాడతూర్పు): తమ కళాశాల విద్యార్థులు 2025లో విద్య, పరిశోధన, క్రీడలు తదితర రంగాల్లో విశేష పురోగతి సాధించారని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన తన చాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్‌లో తమ కళాశాల రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. యూజీ పరీక్షల్లో 98.2 శాతం, పీజీలో 152 మందికి 150 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. తమ కళాశాలకు 36 మందికి యూజీ రీసెర్చ్ స్కాలర్ షిప్స్, ఒక ఫ్యాకల్టీకి ఐసీఎంఆర్ స్కాలర్‌షిప్ లభించడం పరిశోధనా రంగంలో సాధించిన పురోగతికి నిదర్శనమన్నారు. పలు సదస్సుల్లో పేపర్ ప్రెజెంటేషన్, క్విజ్, డిబేట్‌లలో గోల్డ్‌మెడల్స్ సాధించారని తెలిపారు. క్రీడల్లో సైతం అత్యుత్తమ ప్రతిభతో ఇంటర్ మెడిక్స్ పోటీల్లో ఓవరాల్ రన్నర్స్‌గా నిలిచారన్నారు. ఇలా అన్ని రంగాల్లో తమ విద్యార్థులు రాణించడం గర్వకారణంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా ముందుకెళ్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.
డీసీఎంను ఢీకొన్న కారు.. విజయవాడ వాసి మృతి
మరో ముగ్గురికి గాయాలు
లింగాలఘణపురం: డీజే ప్రోగ్రామ్‌లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు. కారు.. ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం జనగామ – సూర్యాపేట జాతీయ రహదారిపై వడిచర్ల వద్ద చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన సయ్యపురాజు విష్ణువర్ధన్(32), కారు డ్రైవర్ లవరాజ్, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన రాంప్రసాద్, హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన శరత్‌కుమార్ డీజే ప్రోగ్రామ్ నిమిత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం వెళ్లారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం కారులో విజయవాడ బయలుదేరారు. మార్గమధ్యలో వడిచర్ల కల్వర్టు వద్ద ఆగి ఉన్న డీసీఎంను ఎదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో విష్ణువర్ధన్ అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు విష్ణువర్ధన్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
సిద్ధార్థ వైద్య విద్యార్ధుల అద్భుత ప్రతిభ
సిద్ధార్థ వైద్య విద్యార్ధుల అద్భుత ప్రతిభ


