Vice President : కరోనా కట్టడికి పంచ సూత్ర ప్రణాళిక

Vice President Venkaiah Naidu Proposed Five Rules To Overcome Corona In Virtual Meeting With NRIs - Sakshi

కరోనా భయాలు వీడాలి

ఇతరులకు సహాయం చేయాలి 

 పుకార్లు, అపోహలతో ఆందోళన తప్పదు 

భాషాభివృద్ధికీ ఐదు సూత్రాల ప్రతిపాదన

‘కొత్త కథలు’ పుస్తక ఆవిష్కరణ 

పుస్తకాన్ని తీసుకొచ్చిన వంశీ ఆర్ట్ థియేటర్  

హైదరాబాద్:  కరోనా మహమ్మారిని జయించే దిశగా ప్రతీ ఒక్కరూ పంచ సూత్ర ప్రణాళికను అనుసరించాలని ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఈ ప్రణాళికతో భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొనగలమని ఆయన పేర్కొన్నారు. కరోనాపై వస్తున్న అపోహలు, పుకార్లను విశ్వసించడం ద్వారా ఆందోళనే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, వివిధ నేపథ్యాలకు చెందిన 80 మంది రచయితలు రాసిన కథలతో వంశీ ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో వచ్చిన  ‘కొత్త (కరోనా) కథలు’ పుస్తకాన్ని శనివారం హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. 

ప్రవాసులకు అభినంధనలు
అమెరికాలో నివసిస్తున్నప్పటికీ అమ్మభాషను మరచిపోకుండా మాతృభూమితో మమేకమవుతూ ఈ కొత్త కథలు పుస్తకంలో తెలుగు కథలతో ఆకట్టుకున్న ప్రవాసాంధ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మన సంస్కృతి సంప్రదాయాలు, పండుగలను ముందు తరాలకు అందించేందుకు సృజనాత్మక మార్గాలను అన్వేషించి, వాటిని అక్షరబద్ధం చేసి ముందుతరాలను ప్రేరేపించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిమీదా ఉందన్నారు. ఈ సందర్బంగా మాతృభాషలను కాపాడుకునేందుకు వెంకయ్యనాయుడు కొన్ని సూచనలు చేశారు.


మాతృభాషలను కాపాడుకునేందుకు ఉపరాష్ట్రపతి ప్రతిపాదించిన పంచసూత్ర ప్రణాళిక
- మాతృభాషలో ప్రాథమిక విద్య అందేలా చూడటం.
- పరిపాలనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడం.
- న్యాయస్థానాల కార్యకలాపాలు సైతం మాతృభాషలోనే సాగడం
- ఉన్నతవిద్య, సాంకేతిక విద్యల్లో స్వదేశీ భాషల వినియోగం క్రమంగా పెంచడం
- ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో, తమ కుటుంబ సభ్యులతో మాతృభాషలోనే మాట్లాడేందుకు ప్రాధాన్యత  

కరోనా పోరులో
కరోనా విషయంలో ప్రారంభంలో ఆందోళనకు గురయినా వెంటనే తేరుకుని ప్రభుత్వాలు, ప్రజల భాగస్వామ్యంతో  ఈ మహమ్మారితో పోరాటం చేయడంలో భారత్‌ ముందు వరుసలో ఉందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మన శాస్త్రవేత్తలు, పరిశోధనకారుల కృషితో టీకాను తయారు చేసి మన ప్రజలకే కాకుండా, విదేశాలకు  సైతం అందించారని చెప్పారు.  ప్రజల్లో టీకాలపై ఉన్న అపోహలను తొలగించాలని సూచించారు. 

కరోనా కట్టడికి సూచనలు
- కోవిడ్ ఎదుర్కొనే దిశలో శారీరక శ్రమ, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అవసరమన్నారు. దీని కోసం వ్యాయామం, నడక, యోగ లాంటివి చేయాలన్నారు. 
- ధ్యానం చేయడం  ద్వారా మానసిక ప్రశాంతత పొందాలన్నారు.
- వ్యర్థమైన జంక్‌ఫుడ్ మీద గాక సంతులన, పోషకాహారం మీద ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి.
- ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం, మాస్కులు , చేతులు శుభ్రం చేసుకోవడం  టీకా తీసుకోవడం వంటిని తప్పనిసరిగా చేయాలన్నారు. 
- ప్రకృతిని ప్రేమించాలని ఏసీ గదుల్లో కాకుండా.. వీలైనంత ఎక్కువగా గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశాల్లో ఉండడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 

నివాళి
కరోనా కొత్తకథల్లో భాగస్వాములైన రచయితలందరినీ ఉపరాష్ట్రపతి అభినందించారు. కొత్త అనుభవాలనుంచి పుట్టిన కథలు ఆసక్తికరంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఈ పుస్తకాన్ని గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు అంకితమివవ్వడాన్ని ఆయన  ప్రత్యేకంగా అభినందించారు. బాలసుబ్రమణ్యం జీవితం తెలుగు సినిమా సంగీత చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. మరోసారి బాలుకి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఇటీవల మరణించిన కాళీపట్నం రామారావు, పోరంకి దక్షిణామూర్తిలకు  ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు.

వర్చువల్‌గా
వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఇందులో అమెరికాకు చెందిన గుండె వైద్య నిపుణులు,  ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, వంశీ ఆర్ట్స్ థియేటర్ వ్యవస్థాపక అధ్యక్షులు వంశీ రామరాజు, ప్రముఖ రచయితలు అంపశయ్య నవీన్,  భువనచంద్ర, అమెరికా నుండి వంగూరి ఫౌండేషన్ అధినేత డాక్టర్ చిట్టెన్ రాజు వంగూరి, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మోహన్ కిషోర్ బాబు కేశాని, మరియు గానకోకిల శారద ఆకునూరి , సింగపూర్ నుండి "శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షలు"  రత్న కుమార్ కవుటూరు, రాధికా మంగిపూడి, సిడ్నీ నుంచి విజయ గొల్లపూడి, లండన్ నుంచి నవతా తిరునగరి, ఒమన్ నుంచి డాక్టర్ రామలక్ష్మి తాడేపల్లి, కెనడా నుండి సరోజ కొమరవోలు, చెన్నై నుండి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సీఎంకే రెడ్డి, హైదరాబాద్ నుండి జేవీ పబ్లికేషన్ జ్యోతి వాల్లభోజు మరియు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన రచయితలు ఉన్నారు. సింగపూర్ నుండి రాధాకృష్ణ  సాంకేతిక సహకారం అందించారు.
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top