''నెల నెలా తెలుగువెన్నెల'' 18వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా | TANTEX Nela Nela Telugu Vennela18th anniversary celebrations | Sakshi
Sakshi News home page

TANTEX ''నెల నెలా తెలుగువెన్నెల'' 18వ వార్షికోత్సవం

Jul 23 2025 12:44 PM | Updated on Jul 23 2025 12:46 PM

TANTEX  Nela Nela Telugu Vennela18th anniversary celebrations

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ ''నెల నెలా తెలుగువెన్నెల'' ,తెలుగు సాహిత్య వేదిక  18వ వార్షికోత్సవం 2025  జూలై  నెల 19 వ తేదీన డాలస్‌లోని ఇన్నోవేషన్ హబ్ మీటింగ్‌ హాల్‌లో ఘనంగా జరిగింది.  

తొలుత చిరంజీవి సమన్విత మాడా   త్యాగరాజ కీర్తన''మనవ్యాలకించరాదటే' ప్రార్ధన గీతంతో  సదస్సును  ప్రారంభం కాగా, తరువాత  ప్రముఖ కవి కీ శే  వడ్డేపల్లి కృష్ణ వ్రాసిన సంస్థ ప్రత్యేక గీతం ''నెల నెలా -తెలుగు వెన్నెలా ''ని ప్రముఖ గాయని శివాత్మిక ఆలపించారు. సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా స్వాగత వచనాలు పలుకుతూ సాహిత్య వేదిక గత 18 ఏళ్ళుగా క్రమం తప్పకుండా ప్రతి 3 వ ఆదివారం సాహిత్య కార్యక్రమాలని నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా, తెలుగు భాషా సాహిత్యాలని సుసంపన్నం చేసిన ఎందరో మహామహులు ఈ వేదికని అలంకరించారని, అలాగే ఎన్నో సాహిత్య ప్రక్రియల ప్రదర్శన జరిగిందని తెలియజేసారు. గత రెండేళ్లుగి  నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మంది సాహితీ ఉద్దండులతో సాన్నిహిత్యాని కలిగించిందన్నారు. 


 

ముఖ్య అతిథి సంస్కృతాంధ్ర ద్విశతావధాని పాలడుగు శ్రీచరణ్ గారిని సాహితీ ప్రియులకు పరిచయం చేశారు. సాఫ్ట్వేర్ రంగం లో ఉద్యోగం చేస్తూ గత మూడు దశాబ్దాలుగా అమెరికాలో నివాసం ఉంటున్న వీరు, ఇప్పటిదాకా 36 అష్టావధానాలు,  2 శతావధానాలు, ఒక ద్విశతావధానము చేసారు. ఈ రోజు విశిష్టమయిన  సంస్కృతాంధ్ర ఏకాదశావధానం చేయబోతున్నారు.కార్యక్రమానికి సంధాతగా తొలి తెలుగు అమెరికా అవధాని ఆచార్య పుదూరు జగదీశ్వరన్ గారు వ్యవహరించి అవధాన ప్రక్రియ ని సభకు పరిచయం చేసి కార్యక్రమం ఆరంభించారు.అటు సంస్కృతం, ఇటు తెలుగు పూరణలతో, సమయోచిత సందర్భ సహిత వివరణలతో, చతురోక్తులతో ఆద్యంతం అవధాని గారు ఆహుతులను అలరించారు.

పృచ్చకులుగా నిషిద్ధాక్షరి- జంద్యాల జయకృష్ణ బాపూజీ, సమస్య- ఉపద్రష్ట సత్యం, దత్తపది-చంద్రహాస్ మద్దుకూరి, వర్ణన-డా.గుర్రం మైథిలి, న్యస్తాక్షరి-సిద్దా శ్రీధర్,అప్రస్తుత ప్రసంగము-మాడాదయాకర్, పురాణము-వేముల లెనిన్, ఆశువు-పాలూరి సుజన,సంస్కృతము దత్తపది-నేమాని రాజశేఖర్, సమస్య-పేరి భార్గవి,వర్ణన-రామడుగు నరసింహాచార్యులు వ్యవహరించారు. 'కృత్స్న జ్యోత్స్నల వీడి చెప్పగదవే హృత్స్నేహమేపారగన్' అంటూ క్లిష్టమైన ప్రాసలతో కూడిన సమస్యను వారు పూరించిన తీరు, 'రసాభాసోజాతః కవికులగురోః కావ్యనిచయే' సంస్కృత సమస్యాపూరణము ఆహుతులను అలరించింది. అవధానానంతరము సభికుల కరతాళ ద్వనుల మధ్య సంస్థ అవధాని గారిని ఘనంగా సత్కరించింది.

విశిష్ట అతిథులుగా విచ్చేసిన ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం పొందిన పర్వ నవలానువాద అనుభూతులను పంచుకుంటూ 'అనువాద పర్వం' పై ప్రసంగించారు. తరువాత హైదరాబాద్ విశ్వవిద్యాలయం లోని అనువర్తిత భాషాశాస్త్రం  మరియు అనువాద అధ్యయనాల కేంద్రానికి నిర్దేశకుడిగా పదవీ విరమణ చేసిన ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు గారు ' యంత్రానువాద వ్యవస్థల ' పై సోదాహరణముగా ప్రసంగం గావించారు. ఈ ఇరువురి ప్రధాన ప్రసంగాలు ఆహుతులని చాలా అలరించాయి. భాషకి సంబంధించిన కొత్త కోణాలని పరిచయం చేసాయి.

చివరగా కాలార్చన డాక్టర్ రాళ్ల బండి కవిత ప్రసాద్ శాస్త్రీయ నృత్య రూపకం, దేవి భాగవతం ఆధారంగా చేసుకుని కాలాన్ని నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ఈ విశిష్టమైన సాహిత్యం, శ్రవ్యమైన సంగీతంతో 40 మంది నర్తకి నర్తకులతో కనుల పండుగగా ఈ నృత్య రూపకాన్ని కళా రత్న కెవి సత్యనారాయణ నృత్య దర్శకత్వం వహించారు. డాలస్ నగరంలోని ప్రముఖ నృత్య సంస్థల నుండి నాట్య గురువులు, నాట్య కళాకారులు ఈ నృత్య రూపకంలో పాత్రను పోషించారు. అనంతరం  ఉత్తర  టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సంస్థ కార్యవర్గ బృందము మరియు పాలక మండలి,  సంస్థ తరపున అతిథులందరికీ సన్మాన పత్ర జ్ఞాపికలు శాలువాలతో   సత్కరించారు.

ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి  వందన సమర్పణ చేసి, సహకరించిన అందరికీ పేరు పేరునా  కృతజ్ఞతలు తెలిపారు.  సభా వేదికను ఇచ్చి సహకరించిన విజయ్ బొర్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

ఈ కార్యక్రమములో సంస్థ ఉత్తరాధ్యక్షులు మాధవి లోకిరెడ్డి,పాలక మండలి అధిపతి డా కొండా తిరుమల్ రెడ్డి, సభ్యులు డా శ్రీనాథ్ రెడ్డి పల్వల, సురేష్ మండువ, జ్యోతి వనం, కార్యవర్గ బృందం ఉదయ్ నిడిగంటి, దీప్తి సూర్యదేవర,  సునీల్ సూరపరాజు, నరసింహ పోపూరి, శివారెడ్డి వల్లూరు, లెనిన్ తుళ్ళూరి సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర,శ్రీ సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ,డాక్టర్ నరసింహ రెడ్డి ఊరిమిండి ,చిన్న సత్యం వీర్నాపు,చంద్ర కన్నెగంటి మరియు ప్రముఖ రచయితలు వంగూరి చిట్టెం రాజు, అత్తలూరి విజయలక్ష్మి  పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement