డాలస్, టెక్సస్: తానాసంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరున్నర సంవత్సరాలగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. 97 వ అంతర్జాల సమావేశం సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ స్వాగతోపన్యాసంతో ప్రారంభమై విజయవంతంగా ముగిసింది.
ప్రత్యేకఅతిథిగా పాల్గొన్న గురు సహస్రావధాని డా. కడిమిళ్ళ వరప్రసాద్ మాట్లాడుతూ “అవధాన రంగంలో సుప్రసిద్ధులైన వారిలో ఆరుగురు అవధానులు ఒకే వేదికపై పాల్గొని తమను అవధానులుగా తీర్చిదిద్దిన గురువులకు కృతజ్ఞతలు తెలియజేయడం ఇదే తొలిసారి అని, ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారంచుట్టిన తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర వారి బృందం అభినందనీయులు అన్నారు. తెలుగు వారికే సొంతమైన ఈ అవధాన ప్రక్రియను పరిరక్షిస్తున్న ఈ అవధానులకు ఆశీస్సులు, వీరిని స్పూర్తిగా తీసుకుని మరింతమంది అవధానులు తయారుకావాలని ఆకాంక్షించారు”.
డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ – “ఏకాగ్రతకు ప్రతీకలై, జ్ఞాపకశక్తికి నిలువెత్తు నిదర్శనాలై, ఆశుకవిత్వానికి అపూర్వమైన వైభవంతో, ప్రశ్నకు పద్యంతో, సమస్యకు సమయస్ఫూర్తితో, సవాలుకు సృజనాత్మకతతో సమాధానమిచ్చే అష్టావధాన, శతావధాన, సహస్రావధాన సంప్రదాయాలను పరిరక్షించి అవధాన విద్యను మనకు వారసత్వంగా అందించిన, అందిస్తున్న సాహితీమూర్తులకు, అవధాన గురువులందరికీ శతకోటి వందనాలు అన్నారు”.
ఈ అవధాన గురువందనం కార్యక్రమంలో ఈ క్రింది అవధానులు పాల్గొని వారి వారి అవధాన గురువుల పాండిత్య ప్రతిభ, క్రమశిక్షణ, శిక్షణా విధానం, శిష్యులపై వారు చూపిన అభిమానం, వాత్సల్యం, సహనం వల్లనే అవధాన రంగంలో నేడు తాము అవధానులుగా కొనసాగగల్గుతున్నామని, అందుకు ఏమిఇచ్చినా తమ గురువుల ఋణం తీర్చుకోలేమని వారికి వినమ్ర ప్రణామాలను తెలియజేశారు.
● సహస్రావధాని కోట వేంకట లక్ష్మీనరసింహం - వారి గురువు గురుసహస్రావధాని డా. కడిమిళ్ళ వరప్రసాద్ గారి గురించి
● శతావధాని డా. ఆముదాల మురళి – వారి గురువు శతావధాని, కవి, పండితులు, పద్మశ్రీ డా. ఆశావాది ప్రకాశరావు గారి గురించి
● ద్విశతావధానిని డా. బులుసు అపర్ణ - వారి గురువు అవధాన ప్రాచార్యులు డా. ధూళిపాళ మహాదేవమణి గారి గురించి
● పద్యకోకిల, అష్టావధాని డా. బోచ్కర్ ఓమ్ప్రకాశ్ – వారి గురువులు డా. అవధానం రంగనాథ వాచస్పతి; డా. ఆయాచితం నటేశ్వర శర్మ , శతావధాని డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గార్ల గురించి
● శతావధాని నల్లాన్ చక్రవర్తుల సాహిత్ – వారి గురువులు శతావధాని పద్మశ్రీ డా. ఆశావాది ప్రకాశరావు; ప్రముఖ కవి, అన్నమరాజు ప్రభాకరరావు; అచ్చతెనుగు శతావధాని డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, శతావధాని డా. ఆముదాల మురళి గార్ల గురించి
● గీతావధాని, అష్టావధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు - వారి తొలి గురువు సద్గురు డా. ఉమర్ ఆలీషా , ఏ. సచ్చిదానందమూర్తి గార్ల ప్రతిభాపాటవాలను ప్రస్తుతించారు.
పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును
https://youtube.com/live/-3ohiLhpKNs


