స్కాట్‌లాండ్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

Sri Rama Navami Celebrations In Scotland - Sakshi

శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల వారి కల్యాణోత్సవాన్ని యూకేలోని స్కాట్లాండ్ దేశంలో గల అబర్డీన్  ప్రాంతంలోని హిందూ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్ట మొదటి సారిగా తెలుగు ప్రాంత ప్రజలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రజలు అంగరంగ వైభవంగా ఈ వేడుకలు  కన్నుల పండగగా జరుపుకున్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్సవ ప్రాంతానికి తరలివచ్చారు. స్కాటిష్ ప్రజలు సైతం ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. రామనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. సీతాసమేత రాములోరిని  దర్శించుకునేందుకు భక్తులు క్యూలో బారులు తీరారు. శ్రీరామ జయరామ, జయ జయ రామ అంటూ తెలుగు ప్రాంత భక్తులు నినాదాలతో హోరెత్తించారు.

ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వాహకులు పడకంటి వివేక్, గోల్కొండ వేద, రమేశ్ బాబు, డాక్టర్ నాగ ప్రమోద్, బోయపాటి హారి లు అట్టహాసంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. స్కాట్ లాండ్ లోని చుట్టుపక్కల ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహరాష్ట, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయ భక్తులు దాదాపు 350 మంది వరకు తరలివచ్చారు. భక్తులు స్వామివారికి కట్నకానుకలు సమర్పించుకున్నారు. అనంతరం స్వామి వారి పల్లకి సేవ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణ అనంతరం అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.


 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top