కారు దొంగతనాన్ని అడ్డుకోబోయాడు, పాపం.. ప్రాణం పోగొట్టుకున్నాడు! | Indian American Doctor killed By thief in Washington DC | Sakshi
Sakshi News home page

NRI News: కారు దొంగతనాన్ని అడ్డుకోబోయాడు, పాపం.. ప్రాణం పోగొట్టుకున్నాడు!

Mar 12 2022 2:04 PM | Updated on Mar 12 2022 2:19 PM

Indian American Doctor killed By thief in Washington DC - Sakshi

​కారు దొంగతనం అడ్డగించేందుకు చేసే ప్రయత్నంలో ఓ డాక్టర్‌ ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో మార్చి 8న రాత్రి 8 గంటల సమయంలో వాషింగ్టన్‌ డీసీలో జరిగిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన రాకేశ్‌ పటేల్‌ (33) అనే వైద్యుడు దుర్మరణం పాలయ్యాడు. 

వాష్టింగ్టన్‌ డీసీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నాడు రాకేశ్‌ పటేల్‌. దుర్ఘటన జరిగిన రోజు నగరంలో ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్‌ని కలిసేందుకు వెళ్లాడు.  అక్కడ ఆమెకు కొన్ని వస్తువులు అందించి వెనక్కి తిరగ్గా.. తన కారులో మరెవరవో ఉన్నట్టు రాకేశ్‌ గుర్తించాడు. వెంటనే కారు వైపుకు నడిచాడు.

రాకేశ్‌ రావడం గమనించిన కారులోని అగాంతకుడు... కారుతో వేగంగా రాకేశ్‌ని ఢీ కొట్టాడు. ఆ తర్వాత అతని శరీరంపై నుంచి కారుని పోనిచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన రాకేశ్‌ని వెంటనే ఆస్పత్రికి తరలించినా అతని ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటనలో దుండగుడు రాకేశ్‌కి చెందిన మెర్సిడెజ్‌ బెంజ్‌ కారుని దొంగలించడంతో పాటు అతని ప్రాణాలు బలిగొన్నాడు.

ఈ దుర్ఘటనకు కారణమైన నిందితుడిని పట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని వాష్టింగ్టన్‌ పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఓహియోలో ఉన్న రాకేశ్‌ తల్లిదండ్రులు వాషింగ్టన్‌కి పయణమయ్యారు. కళ్లెదుటే జరిగిన దారుణం చూసిన రాకేశ్‌ పటేల్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఇంకా షాక్‌లోనే ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement