భూముల రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

భూముల రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

Nov 12 2026 1:25 AM | Updated on Nov 12 2026 1:25 AM

● ఈ నెలాఖరులోగా తొలి విడత

ప్రక్రియను పూర్తి చేయాలి

● వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌: రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియను ప్రజలకు మేలు జరిగేలా, సానుకూల వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. తప్పిదాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా, నాణ్యతతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో భూముల రీసర్వే ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్‌న్స్‌ ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రీసర్వే ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నా యో తెలుసుకునేందుకు గ్రౌండ్‌ రిపోర్టులను సేకరిస్తున్నామని, రీసర్వే సందర్భంగా ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా చర్చిస్తున్నామని తెలిపారు. ఈ నెలాఖరులోగా ప్రతి జిల్లాలో తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాలతో పాటు నక్షా లేని గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. రైతులకు ముందస్తుగా నోటీసులు జారీ చేయడంతో పాటు అవసరమైన కౌన్సెలింగ్‌ నిర్వహించాలని తెలిపారు. ప్రజలకు రీసర్వే వివరాలు పూర్తిస్థాయిలో తెలియజేయాలని, వచ్చిన అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. రీసర్వే పూర్తయిన ప్రాంతాల్లో కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలను క్యూఆర్‌ కోడ్‌తో అందించనున్నట్లు మంత్రి తెలిపారు. సాగునీటి చెరువులు, ఇతర అభివృద్ధి పనుల కోసం గతంలో భూసేకరణ చేసిన భూములకు సంబంధించిన సర్వే నంబర్లలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రీసర్వేలో ఏ అధికారి అయినా అక్రమాలకు, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. జిల్లా లో తొలి విడతగా నిర్వహిస్తున్న రీసర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. వీసీలో అదన పు కలెక్టర్‌ రాజాగౌడ్‌, ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాల్వియ, డీఆర్‌వో గీత, ఆర్డీవోలు రాజేంద్ర కుమార్‌, విజయ కుమారి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement