నాగిరెడ్డిపేట: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన నాగిరెడ్డిపేట మండలం తాడూర్‌గేట్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ధర్మారెడ్డి గ్రామానికి చెందిన దాసరి వెంకట్(44)కు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. మంగళవారం రాత్రి ఇంటి నిర్మాణ పనులు ముగించుకొని బైక్‌పై మెదక్‌కు వెళ్తుండగా తాడూర్ గేట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొన్నది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతను స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నవీపేట: మండల కేంద్రంలో బుధవారం అక్రమంగా తరలిస్తున్న 38 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ పవన్ కుమార్ తెలిపారు. నవీపేట నుంచి ధర్మాబాద్ వైపు బొలేరో వాహనంలో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం రావడంతో బాసర క్రాసింగ్ దగ్గర వాహనాన్ని పట్టుకున్నామన్నారు. 38 క్వింటాళ్ల బియ్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వేల్పూర్: బాల్కొండలో కొద్ది కాలంగా తనను పెళ్లి చేసుకోవాలని మహిళను వేధించిన రియాజ్ అనే వ్యక్తిని బు ధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై యాసిర్ అర్ఫాత్ తెలిపారు. అతనిని ఆర్మూర్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చగా జడ్జి రిమాండ్ విధించారని అన్నారు.
తూప్రాన్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి మెదక్ జిల్లా పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. వివరాలిలా.. జిల్లాలోని ఓ మండలానికి చెందిన మైనర్ బాలికకు కామారెడ్డి జిల్లాకు చెందిన మామిడ్ల సంజీవ్‌తో వివాహం చేయాలని బాలిక తల్లి తొలుత భావించింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. బాలికకు పెళ్లి వయస్సు లేదని భావించి తల్లి వివాహాన్ని వాయిదా వేసింది. కాగా ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలిక, కామారెడ్డిలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి సంజీవ్‌కు ఫోన్ చేయగా, బాలికను తన ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై రాజు కేసు నమోదు చేశారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ సమగ్ర దర్యాప్తు జరిపి కోర్టులో సాక్ష్యాధారాలు సమర్పించారు. న్యాయమూర్తి కేసు పూర్వాపరాలను పరిశీలించి నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.20వేల జరిమానా విధించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అధికారులను ఎస్పీ అభినందించారు.
కమ్మర్‌పల్లి: మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామ పరిధిలో ముళ్లపంది మాంసం విక్రయిస్తున్న ఇద్దరిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈతవనం వద్ద ముళ్లపంది మాంసం విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు అక్కడికి వెళ్లి మాంసం విక్రయిస్తున్న వన్నెల్(బీ)కి చెందిన సింగజోగి కిషన్, మిట్ట సునీల్‌లను అదుపులోకి తీసుకొని, మాంసంను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎఫ్‌ఆర్‌వో అరుణ్‌కుమార్ తెలిపారు.


