నిజామాబాద్ అర్బన్: జిల్లాకేంద్రంలో ఈనెల 25, 26న 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో ఏర్పాట్లను సోమవారం ఐజీ కోచుల బృందం పరిశీలించారు. వివిధ క్రీడావిభాగాలకు చెందిన కోచ్ బృందం వాటర్‌స్పోర్ట్స్, అథ్లెటిక్స్, సైక్లింక్, స్విమ్మింగ్, ఆర్చరీ తదితర క్రీడా విభాగాలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. క్రీడాకారులకు అవసరమైన ఏర్పాట్లు, పోటీల నిర్వహణ ప్రదేశంలో క్రీడాకారులు, కోచ్‌లు, సాంకేతిక సిబ్బంది, రాకపోకలు, భద్రత విషయాలను పరిశీలించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే పోలీసు క్రీడాకారులకు మెరుగైన సౌకర్యలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. సీపీ సాయిచైతన్య, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్‌బాబు, తదితరులున్నారు.
నిజామాబాద్ అర్బన్: జిల్లాకేంద్రంలోని సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణిలో 15 ఫిర్యాదులు వచ్చాయి. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి తక్షణమే వాటిని పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
వేల్పూర్: మండలంలోని కుకునూర్ గ్రామంలో సోమవారం మండల వ్యవసాయాధికారి రాజు వరి పంట కోత ప్రయోగం నిర్వహించారు. గోజూరు మహేశ్, ఎద్దండి రాజేందర్ వ్యవసాయ క్షేత్రాలలో పంట కోత ప్రయోగంలో భాగంగా పావు గుంట విస్తీర్ణంలో పంట కోత నిర్వహించి, నూర్పిడి చేసి దిగుబడి అంచనా వేశారు. పావు గుంట విస్తీర్ణంలో 17.55 కిలోల దిగుబడి వచ్చిందన్నారు. సన్నరకానికి చెందిన ఈ వరి పంట ఎకరానికి 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. ఈ ప్రయోగం ద్వారా గ్రామ సరాసరి దిగుబడి అంచనా వేయనున్నట్లు ఏవో తెలిపారు. ఏఈవో శివప్రసాద్, సుస్థిర వ్యవసాయ కేంద్రం సీఆర్పీ చింత శ్రీనివాస్, భార్గవ్, రైతులు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్: దీపావళి పండుగ సందర్భంగా జిల్లావ్యాప్తంగా పోలీసులు వివిధ ప్రాంతాల్లోని పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. మొత్తంగా 125 కేసులు నమోదు కాగా, 649మందిని అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. వారి వద్ద నుంచి రూ.13 లక్షల 7వేల 390 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. డివిజన్ల వారిగా ఇలా.. నిజామాబాద్ డివిజన్‌లో 29 కేసులు నమోదు చేయగా 175 మంది పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. రూ.5 లక్షల 25వేల 370 స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్ డివిజన్‌లో 26 కేసులు నమోదుకాగా 131 మంది పట్టుబడారు. రూ.2 లక్షల 20వేల 760 స్వాధీనం చేసుకున్నారు. బోధన్ డివిజన్‌లో 70 కేసులు నమోదుకాగా 343 మంది పట్టుబడ్డారు. రూ.5 లక్షల 61, 260 స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి ప్రత్యేక టీమ్‌లు పేకాట ఆడుతున్నవారిని పట్టుకున్నట్లు తెలిపారు.


