గాంధారి: ఆర్టీసీ బస్సును కారు ఓవర్‌టేక్ చేసే క్రమంలో రెండు వాహనాలూ అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకువెళ్లాయి. ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం 16 మంది ప్రయాణికులతో బాన్సువాడవైపు వెళ్తోంది. అదే సమయంలో కామారెడ్డి నుంచి గాంధారి వైపునకు వస్తున్న కారు డ్రైవర్ గుడిమెట్ ప్రాంతంలో బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండూ అతి సమీపంలోకి వచ్చి ఒకదానికొకటి తగిలే సమయంలో తేరుకున్న ఇద్దరు డ్రైవర్లు పక్కకు తీసుకున్నారు. అతి వేగంగా ఉన్న రెండు వాహనాలు అదుపు తప్పి రెండువైపులా రోడ్డు పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లాయి. బస్సు రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టును ఢీకొని నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై మహేందర్ తెలిపారు.
● పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు, కారు తప్పిన పెనుప్రమాదం
రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, కారు


