● గుడిసెల్లోని వారికి తొలిప్రాధాన్యత
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● కుర్నాపల్లిలో ‘మా ఇందిరమ్మ
ఇంట్లో తొలి దీపావళి సంబురాలు’
బోధన్: అర్హులైన పేదలకు వారం పది రోజుల్లో రెండో విడత ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తామని, గుడెసెల్లో నివసిస్తున్న వారికి ఇందులో తొలి ప్రాధాన్యత కల్పిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారురాలు లిఖిత ఇంట్లో ఆదివారం ‘మా ఇందిరమ్మ ఇంట్లో తొలి దీపావళి’ కార్యక్రమాన్ని నిర్వహించగా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ భుజంగరావు, డీఆర్వో గీత, సర్పంచ్ సాయిలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా లబ్ధిదారురాలి కొత్త ఇంట్లో కలెక్టర్ పూజలు చేసి, టపాసలు కాల్చారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం జిల్లాలో ఎక్కడైనా గుడిసెల్లో నివసిస్తుంటే, వారి వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాబావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని యాసంగీ సీజన్‌లో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని, నీటి వనరులను పొదుపువాడుకోవాలని సూచించారు. మరో లబ్ధిదారురాలు ప్రియాంక ఇంట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో అడిషనల్ కలెక్టర్, డీఆర్‌వో, అధికారులు పాల్గొన్నారు. బోధన్ ఆర్డీవో విజయకుమారి, సర్పంచ్ సాయిలు, తహసీల్దార్ దత్తాద్రి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు రాజుగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడురాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.


