ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

Nov 3 2026 2:03 AM | Updated on Nov 3 2026 2:03 AM

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలపై ప్రజలు కలెక్టర్‌తోపాటు ఇతర శాఖల అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.

నందిగామ సర్పంచ్‌పై ఫిర్యాదు

నవీపేట మండలం నందిగామ సర్పంచ్‌పై గ్రామానికి చెందిన యువకులు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడని, చేరాయి భూమిని కబ్జా చేసి పట్టా చేసుకున్నాడని ఆరోపించారు. అక్రమంగా ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించుకుంటున్నారని పేర్కొన్నారు. భూ కబ్జాలకు పాల్పడుతున్న సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

బియ్యం ధరలు నియంత్రించాలి

బియ్యం ధరలను అధికారులు తక్షణమే నియంత్రించాలని, అక్రమంగా నిల్వ చేసిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐఎంఎల్‌ మాస్‌లైన్‌ పార్టీ నగర కమిటీ ప్రతినిధులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి సుధాకర్‌ మాట్లాడుతూ గత నెల వరకు 26 కిలోల బియ్యం బస్తా రూ.1200 నుంచి రూ.1600 వరకు ఉండగా ప్రస్తుతం అదే బియ్యం ధర రూ. 2200 నుంచి రూ.2600 కు పెరిగిందన్నారు. భారీగా పెరిగిన ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారిందన్నారు.

కిలో రూ. 66కే విక్రయించాలి

సన్నబియ్యంను ప్రభుత్వం నిర్దేశించిన రూ. 66 కే విక్రయించాలని ఎంఐఎం నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు, కొందరు మిల్లర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు.

మెప్మా ఆర్పీల నిరసన

రేషన్‌ కార్డుల పంపిణీ పనుల నుంచి తమను తప్పించాలని మెప్మా ఉద్యోగులు ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిశారు. ఇటీవల చంద్రశేఖర్‌ కాలనీలో రేషన్‌కార్డుల పంపిణీలో ఇబ్బందులు తలెత్తగా ఓ ఆర్పీ బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైనట్లు గుర్తుచేశారు. అయితే మెప్మా ఉద్యోగులు ఇచ్చిన పనిచేయాలని కలెక్టర్‌ చెప్పడంతో తిరుగుముఖం పట్టారు.

అనర్హుల పేర్లను తొలగించాలి

భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్ట్‌ ఇందూరు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. సర్‌ ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటరు కూడా మిగిలిపోకుండా, అనర్హుల పేర్లను తొలగించేలా చూడాలన్నారు. భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్ట్‌ జిల్లా అధ్యక్షుడు గంజి సాయన్న,స్టేట్‌ మెంబర్‌ ఇంజినీర్‌ గంగాధర్‌, పతంజలి యోగా సమితి జిల్లా ప్రభారి తొర్తి బుచ్చన్న, కిసాన్‌ సేవా సమితి జిల్లా ప్రభారి అబ్బాయి లింబాద్రి తదితరులు ఉన్నారు.

పురుగుల మందుతో ప్రజావాణికి..

జిల్లా కేంద్రంలోని హమాల్‌వాడికి చెందిన విజయ, మనవరాలు సరిత కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. తండ్రి మరణానంతరం తనతోపాటు చెల్లెలికి ఇంట్లో ఒక్కో గది రాసి ఇచ్చారని, కానీ తన చెల్లెలు ఇంట్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించాలని వేడుకుంది. రూరల్‌ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement