ఖలీల్‌వాడి: విద్యార్థులకు ఆటలు మానసిక ఉల్లాసాన్నిస్తాయి. దీంతో వారిలో ఏకాగ్రత పెరిగి చదువు లో రాణించే అవకాశం ఉంటుంది. పాఠశాల స్థాయి లో వివిధ రకాల క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ఇంటర్మీడియెట్‌కు వచ్చే సరికి ఎలాంటి క్రీడ లు లేకపోడంతో వారిలో ఆసక్తి తగ్గిపోతుంది. దీంతో విద్యార్థులు క్రీడాపోటీలకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీడీ) లేకపోవడమే అందుకు కారణంగా చెప్పవచ్చు. 2024లో ప్రభుత్వం పీడీల నియామకాలకు పోటీపరీక్ష నిర్వహించినా ఇప్పటి వరకు ఫలితాలను ప్రకటించలేదు.
అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో..
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పీడీలు లేకపోవడంతో అండర్–19 అంతర్ జూనియర్ కళాశాలల క్రీడా పోటీల్లో విద్యార్థులు పాల్గొనలేకపోతున్నారు. పాఠశాల, ఇంటర్ స్థాయిలో అండర్–17, 19 క్రీడాపోటీలు జరుగుతాయి. ఇప్పటీకే ఎస్జీఎఫ్ ఆధ్యర్వంలో మండల, జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. ఇంటర్ విద్యార్థులకు నిర్వహించే క్రీడలు పీడీ లేకపోవడంతో నిలిచిపోయాయి. కాగా, జిల్లాలో మూడేళ్లుగా వివిధ అసోసియేషన్‌లు అండర్ –17,19 క్రీడలు నిర్వహిస్తుండటంతో వారికి అనుకూలమైన క్రీడాకారులను ఎంపిక చేసుకుంటున్నారనే అపవాదు ఉంది. పీడీల నియామక పరీక్ష ఫలితాలు విడుదలైతే విద్యార్థులకు మేలు చేకూరే అవకాశం ఉంటుందని క్రీడా సంఘాల ప్రతినిధులు చెప్తున్నారు.
7వేలకు పైగా విద్యార్థులు..
జిల్లాలో మొత్తం 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అందులో మొదటి సంవత్సరం 4350, ద్వితీయ సంవత్సరంలో 3500 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో జిల్లా కేంద్రంలోని ఖిల్లా బాలుర కళాశాలలో ఒక్కరే పీడీగా పనిచేయగా, ఆ ఒక్కరు మూడేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. దీంతో అప్పటి నుంచి క్రీడల ఎంపికలు, నిర్వహణ లేదు. అండర్–17, అండర్–19 క్రీడల్లో భాగంగా ఇంటర్ విద్యార్థులను పట్టించుకునే నాథుడే కరవ య్యారు.
పీడీ కోసం లేఖ రాస్తాం..
ఇంటర్ విద్యార్థులకు పీడీ లేకపోవడంతో క్రీడల నిర్వహణకు అసోసియేషన్‌లు ద రఖాస్తు చేసుకుంటే అనుమ తి ఇస్తున్నాం. పాఠశాల నుంచి పీడీని ఇంటర్‌కు కేటాయించాలని కలెక్టర్‌కు లెటర్ అందజేస్తా. దీంతో విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది.
– రవికుమార్, డీఐఈవో, నిజామాబాద్
మూడేళ్లుగా పీడీలు కరువు
ఆటలకు దూరమవుతున్న విద్యార్థులు
అసోసియేషన్‌లకు అండర్–19 క్రీడలు
జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్
కాలేజీలు


