నిజామాబాద్ అర్బన్: గాంధీ జయంతి సందర్భంగా జిల్లా జైలులో శుక్రవారం ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ చట్టం కేసుల విచారణ ప్రత్యేక న్యాయమూర్తి, రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎస్ నారాయణ హాజరై మాట్లాడారు. ఖైదీలు శిక్ష అనంతరం విడుదలైన తర్వాత సమాజంలో గౌరవపదంగా జీవించేందుకు నైపుణ్యాభివృద్ధి, న్యాయవిజ్ఞానం, మెరుగైన వైద్య సదుపాయాలు, మానసిక సామాజిక మద్దతు ఎంతో కీలకమన్నారు. అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన ఖైదీలకు బహుమతులు అందజేశారు. అంతకుముందు ఖైదీలు తయారుచేసిన వివిధ వస్తువులను పరిశీలించారు. జైలు ఆవరణలో నర్సరీని ప్రారంభించారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా జైలు సూపరింటెండెంట్ అశోక్ కుమార్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు, జైలర్‌లు తిరుమలరెడ్డి, శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ జైలర్ మన్మథరావు తదితరులు పాల్గొన్నారు.


