నిజామాబాద్ అర్బన్: మాదిగ హక్కులను సాధించుకునేందుకు అక్టోబర్ 2న కలెక్టరేట్ ముట్టడిస్తామని మాదిగ మహిళా సమాఖ్య జాతీయ అధ్యక్షురాలు నంబూరి తబిత పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సందీప్ గార్డెన్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మందకృష్ణ మాదిగ మార్గదర్శకత్వంలో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాలో జిల్లా స్థాయి ప్రత్యేక మహిళా సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. అక్టోబర్ 2న కలెక్టరేట్ ఎదుట మద్యపాన నిషేధంపై నిరసన తెలుపుతామని, అలాగే తమ హక్కుల సాధన కోసం డిమాండ్ చేస్తామన్నారు. సమాజంలో కుటుంబాలు చిన్నాభిన్నం చేస్తున్న మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. నిరసనలో మహిళలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా మాదిగ మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా పద్మ, ఎంఎస్‌పీ ఇన్‌చార్జీగా సుధాని, జిల్లా అధ్యక్షురాలిగా లావణ్య, ప్రధాన కార్యదర్శిగా సౌజన్య, అధికార ప్రతినిధిగా శ్యామల, ఉపాధ్యక్షులు, కార్యదర్శులుగా పుష్పలీల, యశోద, మహేశ్వరిని నియమించినట్లు ఆమె పేర్కొన్నారు.


