సద్వినియోగం చేసుకోవాలి
● బీసీ మహిళలకు కొత్త పథకం
● 100 శాతం సబ్సిడీతో అందజేత
● సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు గడువు
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధికి ఇందిర మహిళా శక్తి ద్వారా సంక్షేమ పథకాలు, అవకాశాలు కల్పిస్తోంది. తాజాగా బీసీ సామాజికవర్గానికి చెందిన నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా అర్హులైన మహిళల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. తొలి విడతగా రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మహిళలకు ఉపాధి అవకాశాలు
కుట్టు మిషన్ల ద్వారా బీసీ మహిళలు ఉపాధి పొందే అవకాశం ఉంది. 100 శాతం సబ్సిడీతో ఇస్తున్న ఈ మిషన్లను సద్వినియోగం చేసుకుంటే టైలరింగ్ చేసి ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది మహిళలు సెర్ఫ్, మెప్మా, ఇతర శిక్షణ సంస్థల ద్వారా కుట్టు మిషన్లలో శిక్షణ పొంది జీవనోపాధి పొందుతున్నారు. ఈ ఆటోమేటిక్ మిషన్లతో పనిభారం తగ్గి మహిళలకు మేలు చేకూరనున్నది. అర్హులైన బీసీ మహిళలు సెప్టెంబర్ 15 లోపు http:// tgobmms. cgg. gov. in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకొని సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో గ్రామీణులు ఎంపీడీవోకు, పట్టణవాసులు మున్సిపల్ కమిషనర్‌కు సమర్పించాలి.
మండలస్థాయి కమిటీలు..
ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు కన్వీనర్లుగా ఉండగా,దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హుల జాబితాను జిల్లాస్థాయి కమిటీకి పంపిస్తారు. జిల్లాస్థాయి కమిటీ ఆమోదం పొందిన అనంతరం బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందజేస్తారు.
నియోజకవర్గానికి వెయ్యి కుట్టుమిషన్లు..
ప్రతి నియోజకవర్గానికి వెయ్యి కుట్టు మిషన్లు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మంది బీసీ మహిళలను ఎంపిక చేయనున్నారు.
అర్హతలు ఇవే..
దరఖాస్తుదారులు బీసీ వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళలు అయి ఉండాలి.
18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, టైలరింగ్ ట్రైనింగ్ సర్టి ఫికెట్ ఉన్నవారికి, మేర/మేరు కమ్యూనిటీ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు.
కనీస అక్షరాస్యత తప్పనిసరి. 5వ తరగతి పాసైన వారికి అవకాశం.
గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.
తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి కుల, ఆదాయ ఽధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం.
2023–24 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక లబ్ధి పొందిన వారు అర్హులు కారు.
ప్రభుత్వం బీసీ మహిళల అభ్యున్నతికి ఉచిత ఆటోమేటిక్ కుట్టుమిషన్లు అందించనుంది. ఇంటింటా ఇందిరమ్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వచ్చే నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
– ఉదయ్‌భాస్కర్, ఎంపీడీవో, డిచ్‌పల్లి.


