ఆంగ్ల మాధ్యమానికి ప్రభుత్వ పాఠశాలలు సైతం మొగ్గు చూపుతున్న ప్రస్తుత తరుణంలో ఆయా పాఠశాలల్లో తెలుగుభాషను రక్షించడానికి జిల్లాలోని కొందరు ఉపాధ్యాయులు విశేష కృషి చేస్తున్నారు. పాఠశాలల్లో సృజనాత్మక రచనలను నిర్వహించేలా వివిధ సంస్థలు కార్యశాలలను నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా మండల, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు రచనల వైపు తీసుకెళ్తున్నారు.
బాలసాహిత్య వేదిక..
జిల్లాలో ఈ–కవితా, కథా కార్యశాలలు నిర్వహించడంలో ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక ప్రధా న భూమిక పోషిస్తోంది. డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, ప్రవీణ్ కుమార్ శర్మ, చింతల శ్రీనివాస్ గుప్తా, స్వర్ణ సమత, శారద, కోకిల నాగరాజు, గంట్యాల ప్రసాద్ తదితరుల నేతృత్వంలో సాహిత్య వేదిక రెండు సంవత్సరాల నుంచి విద్యార్థులకు కవితా రచన, కథా రచనపై కార్యశాలలు నిర్వహిస్తూ వస్తోంది. కార్యశాలలకు పేరొందిన బాల సాహిత్య వేత్తలను తీసుకొచ్చి విద్యార్థులు కథా, కవితా రచనల్లో మెలకువలను నేర్పుతోంది. ఇప్పటి వరకు సిర్పూర్, ఏర్గట్ల, చౌట్‌పల్లి, గుండారం, నీలా, అంబం, రామకృష్ణ విద్యాలయం తదితర పాఠశాలల్లో విద్యార్థులకు కథా రచన, కవితా రచన మెలకువలను అందించేందుకు కార్యశాలలు నిర్వహించారు.
అమ్మ భాష.. తెలుగు నీరసిస్తోంది. తెలుగులోని చక్కని సామెతలు, పద్యాలు, గద్యాలను కోల్పోయి టెస్టు పేపర్లు, గైడ్‌లపై ఆధారపడటం పెరిగింది. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని.. నాడు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ప్రశంసించారు. అమ్మ భాష నుంచే పిల్లల్లో నైతికత, మానవీయత అలవడతాయి. అలాంటి వ్యవహార తెలుగు భాష కోసం మహనీయుడు గిడుగు రామ్మూర్తి తపించారు. నేడు ఆయన జయంతి (తెలుగు భాషా దినోత్సవం) సందర్భంగా తెలుగు భాష ప్రభావాన్ని నిలుపుతున్న వారిపై ప్రత్యేక కథనం.. – నిజామాబాద్ రూరల్
పాఠశాలల్లో తెలుగుకు
ప్రాధాన్యమిస్తూ కార్యశాలల నిర్వహణ
తెలుగు భాషను కాపాడుతున్న
ఉపాధ్యాయులు, సంస్థలు
నేడు తెలుగు భాషా దినోత్సవం


