సిరికొండ నుంచి చీమన్‌పల్లి వెళ్లే మార్గంలో ఉన్న అటవీ ప్రాంతంలో మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఎక్కడా హెచ్చరిక బోర్డు లు కనిపించవు. రాత్రి వేళ ప్రయాణించే వాహనదారులను అప్రమత్తం చేసేలా రేడియం స్టిక్కర్లు సైతం లేవు. దీంతో వాహనదారులు ప్రాణా లు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఈ మార్గం గుండా పందిమడుగు, చీమన్‌పల్లి, జినిగ్యాల, దుప్యతండా, తాటిపల్లి గ్రామాలతోపాటు పదుల సంఖ్యలో తండాలకు చెందిన ప్రజలు మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు వేములవాడ పుణ్య క్షేత్రానికి ఈ మార్గం చాలా దగ్గరవుతుంది. నిజామాబాద్–1 డిపో బస్సు తాటిపల్లి వరకు, సిరిసిల్ల, వేములవాడ డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు సిరికొండ వర కు నడుస్తుంటాయి. మండల కేంద్రం నుండి మైసమ్మ గుడి వరకు 5 కిలో మీటర్లకు పైగానే అటవీ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో గతంలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మూలమలుపులు తెలిసేలా హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. – సిరికొండ


