బాధితులకు న్యాయం జరగాలి | - | Sakshi
Sakshi News home page

బాధితులకు న్యాయం జరగాలి

Aug 28 2026 1:27 AM | Updated on Aug 28 2026 1:27 AM

నిజామాబాద్‌ అర్బన్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని అధికారులకు కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా సూచించారు. కలెక్టర్‌ అధ్యక్షతన గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్‌న్స్‌ అండ్‌ మానిటరింగ్‌ జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అట్రాసిటీ కేసుల పురోగతిపై నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌ డివిజన్‌ల వారీగా కలెక్టర్‌ సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తీసుకున్న చర్యల వివరాలు తెలుసుకున్నారు. పోలీస్‌, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం, ఇతర సహాయ సహకారాల విషయంలో ఎలాంటి జాప్యం జరుగకుండా చూడాలన్నారు. కేసుల సత్వర పరిష్కారం కోసం రెవెన్యూ, తదితర శాఖల కార్యాలయాల ద్వారా ఎప్పటికప్పుడు అవసరమైన నివేదికలను, లేఖలను అందజేయాలని సూచించారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చూడాలన్నారు.

ప్రతి నెలా ‘సివిల్‌ రైట్స్‌ డే’ను పక్కాగా నిర్వహించాలని, దళిత, గిరిజన వర్గాల ప్రజల హక్కులపై వారికి అవగాహన కల్పించడంతోపాటు వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు జీవనాధారం కోసం ప్రభుత్వం అందజేసిన అసైన్డ్‌ భూములను ఎవరైనా కబ్జా చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని, బాధితులకు భూభారతి చట్టం ద్వారా న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.

గ్రామాల్లో సాంఘిక బహిష్కరణలు వంటి ఘటనలు జరిగినప్పుడు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ శుభం నగ్రాలే, జిల్లా రెవెన్యూ అధికారిణి గీత, జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారిణి రజిత, నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌ ఏసీపీలు ప్రకాశ్‌, శ్రీనివాస్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ భాస్కర్‌తోపాటు సంబంధిత శాఖల అధికారులు, విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement