అమ్మా బైబై.. | - | Sakshi
Sakshi News home page

అమ్మా బైబై..

Aug 28 2026 1:27 AM | Updated on Aug 28 2026 1:27 AM

● చిన్నారిని చిదిమేసిన లారీ

● తండ్రితో స్కూల్‌కు వెళ్తుండగా ప్రమాదం

బాన్సువాడ రూరల్‌ : తండ్రి ద్విచక్రవాహనంపై స్కూల్‌కు వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో చిన్నారి దుర్మరణం చెందిన ఘటన బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్‌ చౌరస్తాలో చోటుచేసుకుంది. బాన్సువాడ పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని వాసవి కాలనీకి చెందిన మహ్మద్‌ రఫీ వెల్డింగ్‌ షాప్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రఫీకి కుమారులు అర్హాన్‌, అయాన్‌, కూతురు జైనబ్‌ ఫాతిమా(4) ఉన్నారు. వీరంతా స్థానిక హీరా మాడల్‌ స్కూల్‌లో చదువుకుంటున్నారు. రోజూ మాదిరిగినే గురువారం ఉదయం 9 గంటలకు తన ముగ్గు రు పిల్లలను స్కూల్‌లో వదిలేందుకు మహ్మద్‌ రఫీ ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. తాడ్కోల్‌ చౌరస్తాలో సిగ్నల్‌ పడటంతో ఆగిన రఫీ ద్విచక్రవాహనాన్ని వెనుకనుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అందరూ రోడ్డు పై పడ్డారు. లారీ డ్రైవర్‌ తొందరపాటుతో లారీ చక్రం జైనబ్‌ ఫాతిమా తలపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కకడే మృతి చెందింది. గాయపడిన అర్హాన్‌, అయాన్‌తోపాటు తండ్రి మహ్మద్‌ రఫీని స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పాఠశాలకు చేరాల్సిన చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. కాగా, జైనబ్‌ ఫాతిమా ఎల్‌కేజీ చదువుతోంది. ప్రమాదానికి కారణమైన మహారాష్ట్ర లారీ, డ్రైవర్‌ షేక్‌ మహ్మద్‌లను అదుపులో తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తుల శ్రీధర్‌ తెలిపారు. విషయం తెలుసుకున్న ఆగ్రోస్‌ మాజీ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రేష్మా ఎజాస్‌, కౌన్సిలర్లు ఖాలేఖ్‌, హకీం, మఖ్బూల్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి మృతితో తాడ్కోల్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో సీఐ తుల శ్రీధర్‌ చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ఆక్రమణలను అధికారులు తొలగించారు.

‘అమ్మా.. బాయ్‌’ అంటూ తండ్రి బైక్‌పై ఉత్సాహంగా స్కూల్‌కు వెళ్తున్న చిన్నారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. అప్పటి వరకు చిట్టిచిట్టి మాటలతో బైక్‌పై ఉన్న కూతురు కళ్లెదుటే లారీ చక్రం కింద నలిగిపోయింది. బాన్సువాడ పట్టణంలో గురువారం ఉదయం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement