వెండి రాఖీలు..
క్షేమాన్ని కోరుతూ..
● సోదర భావానికి ప్రతీక రాఖీ పండుగ
● నేడు రక్షాబంధన్
నిజామాబాద్ రూరల్: అన్నాచెళ్లెల్లు, అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీక జరుపుకొనే పండుగ రక్షాబంధన్. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సోదరులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ సోదరీలు రాఖీ కడతారు. మరోవైపు రాఖీ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమిగా పాటిస్తూ ఉపనయనం పొందిన వారు పాత యజ్ఞోపవీతాన్ని (జంధ్యాన్ని) తీసివేసి, గాయత్రీ దేవిని ఆరాధించి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.
సందడిగా నగరం
రాఖీ పౌర్ణమి నేపథ్యంలో నగరంలో సందడి నెలకొంది. రాఖీలు కొనేందుకు వచ్చిన మహిళలు, పిల్లలతో నగరంలోని కుమార్ గల్లీ, పెద్ద బజార్, పూసలగల్లి, కంఠేశ్వర్ తదితర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
రాఖీలకు గిరాకీ బాగానే ఉంది. మహిళలు ప్రధానంగా వెండి రాఖీలు కొనుగో లు చేసేందుకు ముందుకొస్తున్నారు. రూ.వెయ్యి నుంచి వెండి రాఖీలు అందుబాటులో ఉన్నాయి. – రాము, విక్రేత
అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ. ప్రతి సంవత్సరం నేను మా అన్న, త మ్ముడికి రాఖీ కడతా. వాళ్లు సుఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వదిస్తా. – లత, నగరవాసి


