సుభాష్‌నగర్ : తెలంగాణలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని ఎంపీ అర్వింద్ ధర్మపురి తెలిపారు. బ్లాక్ స్పాట్ల నివారణ, రహదారి భద్రతా చర్యలకు సంబంధించి గురువారం తాను లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన సమాధానంలో కీలక వివరాలు వెల్లడయ్యాయని ఎంపీ పేర్కొన్నారు.
నిజామాబాద్–జగిత్యాలకు ప్రత్యేక ప్రాధాన్యత
జిల్లాలో మొత్తం 78 ప్రమాదకర బ్లాక్ స్పాట్లు గుర్తించగా, వాటిలో 75 ప్రాంతాల్లో నివారణ చర్యలు పూర్తయ్యాయని, మరో 3 ప్రాంతాల్లో చర్యలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని ఎంపీ పేర్కొన్నారు. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో మొత్తం 107 ప్రమాదకర బ్లాక్ స్పాట్లు గుర్తించగా, అందులో 99 ప్రాంతాల్లో నివారణ చర్యలు పూర్తయ్యాయని, మరో 8 ప్రాంతాల్లో పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని ఎంపీ తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని ప్రజల భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమన్నారు.
నిజామాబాద్‌లో జాతీయ రహదారులపై రోడ్డు భద్రత మరింత మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని, పెండింగ్‌లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి తన వంతు కృషి కొనసాగుతుందని అర్వింద్ పేర్కొన్నారు. అలాగే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎన్‌హెచ్–63, ఎన్‌హెచ్–61, ఎన్‌హెచ్–44పై వంతెనలు, బైపాస్‌లు, రోడ్డు భద్రతా చర్యలతో కూడిన అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.1023 కోట్లు కేటాయించిందని ఎంపీ వివరించారు.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో
బ్లాక్ స్పాట్లు, రోడ్ల అభివృద్ధికి రూ.1,023 కోట్లు
లోక్‌సభలో ఎంపీ అర్వింద్ ప్రశ్నకు
మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం


