ఎగుమతులకు అవకాశం
ఆర్మూర్ : ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్, డిచ్‌పల్లి మీదుగా సికింద్రాబాద్ వరకు రైల్వే లైన్ డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ మీదుగా పటాన్‌చెరు వరకు 317 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో కీలకమైన ఆర్మూర్–ఆదిలాబాద్ రైల్వే లైన్‌కు మొదటి విడతలో కేంద్రం అంగీకరించినా నిధుల కేటాయింపు లేక కార్యరూపం దాల్చలేదు. మరోవైపు ఆర్మూర్ నుంచి డిచ్‌పల్లి వరకు రైల్వేలైన్ వేస్తే ఆదిలాబాద్– ఆర్మూర్ లైన్ నిర్మాణానికి మార్గం సుగమం అవుతుంది.
సర్వేకే సరిపోయిన నిధులు
ఆర్మూర్–ఆదిలాబాద్ మధ్య 136.87 కిలోమీటర్ల రైల్వేలైన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టాలని గతంలో నిర్ణయించారు. మొత్తం వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 51 శాతం, కేంద్ర ప్రభుత్వం 49 శాతం నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. నిర్మాణానికి రూ. 699 కోట్లు అవసరం అవుతుందని సర్వేలో తేల్చారు. 2007–08 బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించింది. 2016–17లో కేంద్రం ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్‌ను మంజూరు చేసింది. అయితే, పదేళ్లపాటు నిధుల కేటాయింపు జరగకపోవడంతో అంచనా వ్యయం విపరీతంగా పెరిగి రూ.2,800 కోట్లకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.1,428 కోట్లు, నిర్మాణానికి అవసరమైన భూమిని సమకూర్చడంపై మొదట్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అప్పటి నుంచి రైల్వేలైన్ నిర్మాణంపై కదలిక లేకుండా పోయింది. కేంద్రం ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన అరకొర నిధులతో సర్వేకు మాత్రమే వెచ్చించారు. భూసేకరణ పూర్తయితే గానీ పనులు ప్రారంభమయ్యేలా లేవు. మరోవైపు సోన్ వద్ద గోదావరిపై, కుప్టి ఘాట్స్ వద్ద వంతెనతోపాటు మహబూబ్ ఘాట్ వద్ద టన్నెల్స్, క్రాసింగ్స్ ఏర్పాటుకు టెక్నికల్ ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో ప్రాజెక్టు వ్యయం పెరిగేలా ఉండటం మరో సమస్యగా మారనున్నది.
ఆదిలాబాద్– ఆర్మూర్– డిచ్‌పల్లి– నారాయణ్‌ఖేడ్– సంగారెడ్డి– పటాన్‌చెరు వరకు రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక వైపు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు, మరోవైపు నిజామాబాద్, కరీంనగర్ నుంచి మ హారాష్ట్రలోని నాందేడ్ రైల్వేలైన్‌కు అనుసంధా నం పెరుగనుంది. ఈ మార్గం పూర్తయితే ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతాల్లో పండించే పసుపు, ఎర్రజొన్న, పత్తి, వరి తదితర పంటలను రైల్వే ద్వారా ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది.
ఆర్మూర్ ప్రజలు రైలులో హైదరాబాద్ వెళ్లాలంటే నిజామాబాద్ మీదుగా ప్రయాణించాల్సిందే. అయితే, ఆదిలాబాద్– ఆర్మూర్ లైన్‌తోపాటు ఆర్మూర్ నుంచి డిచ్‌పల్లి లైన్‌కు కనెక్ట్ చేస్తే హైదరాబాద్‌కు రవాణా పెరుగుతుంది. ఆర్మూర్ నుంచి డిచ్‌పల్లి మీదుగా సికింద్రాబాద్‌కు రైల్వే లైన్ నిర్మించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు స్థానిక ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి పలుమార్లు వినతిపత్రాలు సైతం సమర్పించడం గమనార్హం.
ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్, డిచ్‌పల్లి మీదుగా సికింద్రాబాద్ రైల్వేలైన్ కోసం ఎదురుచూపులు
ఆర్మూర్ – ఆదిలాబాద్ రైల్వేలైన్‌కు నిధుల కేటాయింపులో జాప్యం
ఆలస్యం జరిగినా కొద్దీ రెట్టింపు
అవుతున్న వ్యయం


