ప్రైవేట్‌కు దీటుగా సీవోఈ కస్తూర్బాలు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌కు దీటుగా సీవోఈ కస్తూర్బాలు

Mar 6 2026 8:11 AM | Updated on Mar 6 2026 8:11 AM

జిల్లాలో 27 కస్తూర్బా స్కూళ్లు.. విద్యార్థినులకు నాణ్యమైన విద్య

ఖలీల్‌వాడి : కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఇక నుంచి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నారు. విద్యారంగంలో వెనుకబడిన ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, పేద కుటుంబాల విద్యార్థినులకు విద్యనందించే లక్ష్యంతో కొనసాగుతున్న ఈ స్కూళ్ల విద్యార్థినులు రెగ్యులర్‌ పరీక్షల్లో ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ పోటీ పరీక్షల్లో వెనుకబడకుండా ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దనున్నారు. జేఈఈ, నీట్‌, ఎప్‌సెట్‌, క్లాట్‌(కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌) పరీక్షలకు విద్యార్థినులను సన్నద్ధం చేయనున్నారు. ఇందుకోసం జిల్లాలోని డిచ్‌పల్లి, మాక్లూర్‌, నిజామాబాద్‌ కస్తూర్బాలను సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ(సీవోఈ)లుగా అప్‌గ్రేడ్‌ చేశారు. అయితే ఒక్కో పాఠశాలలో ఒక్కో పోటీ పరీక్షకు సంబంధించి శిక్షణను ఉచితంగా ఇవ్వనున్నారు. ఇందుకోసం జిల్లా అధికారుల నుంచి విద్యాశాఖ వివరాలు సేకరించింది.

జిల్లాలో మొత్తం 27 కస్తూర్బా పాఠశాలలు/కళాశాలలు ఉన్నాయి. 2,331 మంది ఇంటర్‌ విద్యను అభ్యసిస్తుండగా అందులో ప్రథమ సంవత్సరం విద్యార్థినులు 1799 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు 532 మంది ఉన్నారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలుగా అప్‌గ్రేడ్‌ అయిన డిచ్‌పల్లి, మాక్లూర్‌, నిజామాబాద్‌ కస్తూర్బాలకు ప్రభుత్వం గ్రంథాలయాలు, ఫర్నిచర్‌, పుస్తకాలతోపాటు ఇతర సామగ్రిని అందుబాటులోకి తెచ్చింది. సెకండియర్‌ చదువుతున్న విద్యార్థినులకు గతేడాది నవంబర్‌, డిసెంబర్‌లో, ఈ ఏడాది జనవరిలో నీట్‌, జేఈఈ, ఐఐటీ, క్లాట్‌ పరీక్షలకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించారు. పరీక్షలు ముగిసిన తరువాత విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయనున్నారు.

పేద విద్యార్థులకు కేజీబీవీలో పూర్తి ఉచితంగా నాణ్యమైన విద్యనందిస్తున్నాం. అలాగే విద్యార్ధినిలను జేఈఈ, ఐఐటీ, నీట్‌, క్లాట్‌ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు విద్యాశాఖ జిల్లాలోని పాఠశాలల వివరాలను అడిగింది. ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు ముగిసిన తరువాత దీనిపై స్పష్టత వస్తుంది. జిల్లాలోని మూడు ఎంపిక చేసిన కేజీబీవీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాం.

– భాగ్యలక్ష్మి, జీసీడీవో, నిజామాబాద్‌

ప్రవేశ పరీక్ష ద్వారా..

వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాత పరీక్ష ద్వారా సీవోఈ పాఠశాలల్లో విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నారు. ఆరో తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 40 సీట్ల చొప్పున కేటాయించారు. పోటీ పరీక్షల శిక్షణ కోసం నలుగురు బోధకులను నియమించడంతోపాటు మానసిక వైద్యులనూ నియమిస్తారు.

జిల్లాలో మూడు పాఠశాలల ఎంపిక

సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ స్కూళ్లలో

పోటీ పరీక్షలకు శిక్షణ

వచ్చే ఏడాది నుంచి రాత పరీక్ష

ద్వారా ప్రవేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement