వరద కాలువలోకి రివర్స్‌ పంపింగ్‌ | - | Sakshi
Sakshi News home page

వరద కాలువలోకి రివర్స్‌ పంపింగ్‌

Mar 3 2026 7:25 AM | Updated on Mar 3 2026 7:25 AM

కాళేశ్వరం నుంచి నీటిని

విడుదల చేసిన అధికారులు

రెండు మీటర్ల మేర నీటిని

నిలువ ఉంచేందుకు చర్యలు

మోర్తాడ్‌(బాల్కొండ): కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నీటిని వరద కాలువకు విడుదల చేస్తున్నారు. యాసంగి పంటలను గట్టెక్కించే ఉద్దేశంతో రివర్స్‌ పంపింగ్‌ను సోమవారం ప్రారంభించారు. కాలువలో రెండు మీటర్ల మేర నీరు నిల్వ ఉంచేందుకు నాలుగైదు రోజులపాటు రివర్స్‌ పంపింగ్‌ కొనసాగనుంది. గాండ్లపేట్‌ వద్ద వరద కాలువకు గండికి మరమ్మతులు కొనసాగుతుండగా.. పనులు జరిగే చోటుకు కొద్ది దూరంలో నీటిని నిలువ ఉంచితే ఆయకట్టు భూములకు సాగునీరందుతుందని గతంలోనే రైతులు విన్నవించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఉన్న పంప్‌హౌజ్‌లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నీటి విడుదలకు ఆటంకం ఏర్పడింది. ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నా గండికి మరమ్మతులు ఇంకా పూర్తి కాలేదు. పాలెం, మోర్తాడ్‌, గాండ్లపేట్‌, తిమ్మాపూర్‌, కమ్మర్‌పల్లి, నాగాపూర్‌, ఉప్లూర్‌ రైతులకు చెందిన దాదాపు 2,600 ఎకరాల భూములకు సాగునీటిని అందించాల్సి ఉంది. నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి నీటిని విడుదల చేయాలని విన్నవించారు. జనవరిలో ఒక దఫా రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నీటిని విడుదల చేసినా పూర్తి స్థాయిలో నీరు నిలువ ఉంచలేదు. మరోసారి నీటిని విడుదల చేసి వరద కాలువలో నిలువ ఉంచితే కాలువకు ఇరువైపులా ఉన్న భూములకు సాగునీటి సమస్య తీరుతుందని రైతులు కోరారు. మరోసారి నీటిని విడుదల చేస్తుండడంతో పాలెం శివారు వరకు నీరు నిలువ ఉంచే అవకాశం ఏర్పడింది. యాసంగి సీజన్‌లో రైతులు వరి, మొక్కజొన్న, నువ్వులు, సజ్జ పంటలను సాగు చేశారు. వరద కాలువలోకి నీరు వచ్చి చేరడంతో పంటలను గట్టెక్కించే అవకాశం ఏర్పడిందని రైతులు అంటున్నారు.

ప్రభుత్వం స్పందించింది

వరద కాలువలో వేసవి ముగిసేవరకు నీటిని నిలువ ఉంచాలని కోరగా ప్రభుత్వం స్పందించింది. నీటిని విడుదల చేయడంతో పంటల సాగుకు ఇబ్బంది తొలగిపోనుంది. యాసంగి సీజన్‌ పంటలు సాగు చేస్తున్న రైతులకు ఊరట లభించింది.

– రొక్కం మురళి, సీడ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌, తిమ్మాపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement