ఆశల పంటపై అకాల దెబ్బ
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో సోమవారం కురిసిన అకాల వర్షం పసుపు రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. సమయానికి టార్పాలిన్లు లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని రైతులు పంటను కాపాడుకోలేకపో యారు. చేతికందిన పంటను అమ్ముకునేలోగా పా డువాన తెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఈ ఏడాది 24 వేల ఎకరాల వరకు రైతులు పసుపు పంటను సాగు చేశారు. సంతృప్తికర దిగుబడి రావడంతోపాటు మార్కెట్‌లో ఫర్వాలేదన్నట్లుగా ధర ఉండడంతో రైతులు ఎంతో ఆశగా పసుపును అమ్మేందుకు సిద్ధమయ్యారు. 40 శాతం పంట వ్యవసాయ మార్కెట్లకు అమ్మకానికి రాగా, ఇంకా 60 శాతం పసుపు కల్లాల్లోనే ఉంది. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గ ప్రాంతాల్లో పసుపును ఉడకబెట్టి కల్లాల్లో ఆరబోస్తున్నారు. ఎండిన పసుపును పాలిష్ చేసి సంచుల్లో నింపుతున్నారు. పక్షం రోజులపాటు ఎండబోసిన పసుపు సోమవా రం ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఆకస్మికంగా కురిసిన వర్షానికి తడిసింది. కొంతమంది రైతులు టార్పాలిన్లు కప్పి ఉంచగా, మిగతా వారు టార్పాలిన్ల కోసం పరుగులు తీశారు. టార్పాలిన్లు దొరకని వారు అలాగే వదిలేశారు. బాల్కొండ, మెండోరా, ముప్కాల్, ఏర్గట్ల, మోర్తాడ్, బోధన్, నిజామాబాద్ రూరల్, జక్రాన్‌పల్లి, డిచ్‌పల్లి, నందిపేట్, డొంకేశ్వర్, ఆలూరు, ఆర్మూర్ మండలాల్లో మోస్తారు వర్షంతో పసుపు తడిసినంత పనైంది. మంగళవారం కూడా జిల్లాకు వర్ష సూచన ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే పొట్ట దశలో ఉన్న జొన్నకు కూడా వర్షంతో ఇబ్బందిగా మారే అవకాశం ఉందంటున్నారు.
తేమతో తీవ్ర నష్టం
పసుపు కొమ్ములను ఎండబెట్టే ప్రక్రియలో ఉండగా అకాల వర్షంతో తడిసిన పంట రంగుమారి నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టార్పాలిన్లు కప్పి ఉంచినా నీరు లోపలికి చేరి కొమ్ము తేమగా మారుతుందని రైతులు చెబుతున్నారు. మార్కెట్లో ధరలు ఆశాజకనంగా ఉన్న తరుణంలో తడిసిన పసుపును మళ్లీ ఆరబోసినప్పటికీ నాణ్యతగా లేకపోతే వ్యాపారులు ధర తగ్గించే అవకాశం ఉందంటున్నారు.
నేడు మార్కెట్ యార్డు బంద్
సుభాష్‌నగర్: జిల్లాలో అకాల వర్షాలు పడే అవకాశం, మర్చంట్ అసోసియేషన్ విజ్ఞప్తి మే రకు మంగళవారం శ్రద్ధానంద్ గంజ్‌లో క్రయవిక్రయాలు బంద్ ఉంచుతున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ ఎన్ అప ర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం భారీ గా పసుపు నిల్వలు తీసుకురావడంతో యార్డు లో స్థలం లేదన్నారు. రైతులు పసుపును అమ్మ కానికి మార్కెట్‌కు తీసుకురావొద్దని కోరారు.
పసుపంతా కల్లాల్లోనే ఉంది...
60 డ్రమ్ముల పసుపు దిగుబడులను మొన్ననే ఉడికించి కల్లాల వద్ద ఆరబోశాను. రెండ్రోజుల్లో కొమ్ము పూర్తిగా ఎండిపోయేది. మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మే సమయంలో అనుకోకుండా వచ్చిన వర్షం పంటను కొంతమేర తడిపేసింది. మళ్లీ ఆరబోయాలంటే ఇబ్బందే.
– గడ్డం చిన్నారెడ్డి, గాదేపల్లి, డొంకేశ్వర్ మండలం
కన్నీరు తెప్పిస్తోంది
చెడగొట్టు వాన పసు పు రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. చేతికందిన పంటకు ఈ విధంగా జరగడం కన్నీరు తెప్పిస్తోంది. పక్షం రోజులపాటు కల్లాల్లో శ్రమించి పసుపును ఎండబోస్తే చివరికి తడిసిపోయింది.
– గంగుల బాపురావు, రైతు, డొంకేశ్వర్
అకాల వర్షానికి తడిసిన పసుపు
పంటను విక్రయించే సమయంలో
రైతు కన్నీటి పర్యంతం
వ్యాపారులు ధర తగ్గిస్తారంటూ
ఆందోళన
ఆశల పంటపై అకాల దెబ్బ


