నిజాలు నిగ్గుతేలాల్సిందే..
● రాజకీయ లబ్ధి కోసమే నాపై
అసత్య ఆరోపణలు
● ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి టౌన్: కామారెడ్డి కళాశాల భూములకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో నిజాలు నిగ్గుతేలాల్సిందేనని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి (కేవీఆర్) అన్నారు. సోమ వారం పట్టణంలోని క్యాంపు కార్యాలయం నుంచి ఒంటరిగా కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణతో సమావేశమై చర్చించారు. కళాశాల భూములకు సంబంధించిన వాస్తవాలను బయట పెట్టాలని కో రుతూ సమాచార హక్కు చట్టం కింద కలెక్టర్‌కు దర ఖాస్తు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నా దగ్గర ఉన్న ప త్రాలు అధికారికం కాకపోవచ్చు, కానీ ప్రభుత్వ అధికారులే స్వయంగా వివరాలు వెల్లడిస్తే నిజం ఏంటో ప్రజలకు తెలుస్తుంది‘ అని అన్నారు. తన తండ్రి కానీ, తాను కానీ ఎలాంటి తప్పు చేయలేదనే విషయం ప్రజలందరికీ తెలియాలన్నారు. ఏది నిజ మో అదే చెప్పాలని కలెక్టర్‌ను తాను కోరానన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని, షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారుగా ఉండి కూడా ఈ రచ్చ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కావాలనుకుంటే సీఎంవో ద్వారా రెండు నిమిషాల్లో డాక్యుమెంట్లు తెప్పించుకోవచ్చని, కానీ కేవలం రా జకీయ లబ్ధి కోసమే తనపై బురదజల్లుతున్నారని విమర్శించారు.
2004 నుండి 2009 వరకు మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ, అప్పట్లో ఈ ఆరోపణలను ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. 1964 నుంచి ఇప్పటి వరకు ఉన్న 263 ఎకరాల కళాశాల భూములను ప్రజా ప్రయోజనాల కోసం వాడుతున్నారా లేక స్వార్థం కోసం వాడుతున్నారా అనే దానిపై పూర్తి వివరాలు ఇచ్చి, ఈ వివాదానికి ముగింపు పలకాలని అధికారులను కోరినట్లు తెలిపారు. సొసైటీ, ఆస్తుల పరిరక్షణ కమిటీ ఉండబట్టే ఆ భూములు అన్యక్రాంతం కాలేవని, విద్యాసంస్థలు వెలిశాయని అన్నారు. కలెక్టర్‌పై నమ్మకం ఉందని నెల రోజుల్లో వివరాలు ఇవ్వకుంటే తదుపరి చర్యలకు వెళ్తానని పేర్కొన్నారు. కామారెడ్డికి రావాల్సిన తెలంగాణ యూనివర్సిటీని రాకుండా షబ్బీర్ అలీ చేశారని ఆరోపించారు. ప్రాణభయం ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. పోయేటప్పుడు ఒక్కడిని పోయినా నాతో పాటు పది మందిని పట్టుకెళ్తానని అన్నారు.


