
కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షం కురిసింది. రెండు రోజుల పాటు వాన దంచికొట్టడంతో జనజీవనం స్తంభించింది. జిల్లా కేంద్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజంపేటలో ప్రహరీ కూలి మీద పడడంతో డాక్టర్ వినయ్ మృతిచెందాడు. దోమ కొండ మండలంలో ఎడ్లకట్ల వాగులో కొట్టుకుపోయినవారిలో ఇద్దరు సురక్షితంగా ఇళ్లకు చేరగా.. బాల్‌రాజ్ అనే వ్యక్తి ఆచూకీ లభించలేదు. బీబీపేట మండలం జనగామలో ఎడ్లకట్ల వాగులో చిక్కుకుని రాజిరెడ్డి అనే రైతు మరణించాడు.
జిల్లాలో ఆగస్టులో సాధారణ వర్షపాతం 224.4 మి.మీ. కాగా 529.0 మి.మీ. వర్షం కురిసింది. రా జంపేట, నాగిరెడ్డిపేట, భిక్కనూరు, ఎల్లారెడ్డి, లింగంపేట, కామారెడ్డి, దోమకొండ, నిజాంసాగర్, తా డ్వాయి, రామారెడ్డి, సదాశివనగర్, పాల్వంచ, మా చారెడ్డి, పిట్లం, బీబీపేట, మహ్మద్‌నగర్, గాంధారి మండలాల్లో రెండు రోజుల్లో 30 సెం.మీ. నుంచి 60 సెం.మీ. దాకా వర్షం కురిసింది. జిల్లాకేంద్రంలో పలువురి వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు విశేషంగా కృషి చేశాయి. 89,568 ఎకరాల్లో పంటకు నష్టం వా టిల్లగా, 18 గేదెలు, 8 ఆవులు, పదివేల కోళ్లు మృత్యువాతపడ్డాయి. 13 ఇళ్లు పూర్తిగా కూలగా, 310 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 44వ నంబరు జాతీయ రహదారి పలు చోట్ల ధ్వంసమై రాకపోక లు నిలిచిపోయాయి. కామారెడ్డి మీదుగా నిజామాబాద్, ఆదిలాబాద్ వెళ్లాల్సిన వాహనాలు చాలాచోట్ల గంటల తరబడి ఆగిపోవాల్సి వచ్చింది.