
లక్షల క్యూసెక్కుల ఇన్ – అవుట్ ఫ్లో
● ఎస్సారెస్పీ 39 గేట్ల ఎత్తివేత
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఇన్, అవుట్ ఫ్లో అనూహ్యంగా పెరిగింది. బుధవారం ఉదయం నుంచి వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. రోజంతా నిలకడగా కొనసాగి సాయంత్రం నుంచి క్రమంగా వరద పెరిగింది. గురువారం మధ్యాహ్నం సమయానికి ఇన్‌ఫ్లో 2.75 లక్షల క్యూసెక్కులకు చేరింది. అదేస్థాయిలో వరద గేట్లు, కాలువల ద్వారా అవుట్ ఫ్లో కొనసాగించారు. సాయంత్రానికి 3.2 లక్షల క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో పెరగగగా, 39 వరద గేట్ల ద్వారా 3.55 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ఎగువ నుంచి మరింత వరద వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ఎప్పటికప్పుడు నీటి విడుదలను పెంచుతూ, తగ్గిస్తూ చర్యలు తీసుకుంటున్నారు.
67.05 టీఎంసీలు..
ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 1087.20(67.05 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.
రెండు రోజులు.. 13 టీఎంసీలు
ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతాల్లో ముంపు ముప్పు తలెత్తకుండ అధికారులు చర్యలు చేపట్టారు. నీటి నిల్వను 80 టీఎంసీల నుంచి 67 టీఎంసీలకు తగ్గించారు.