
జెండా బాలాజీ ఉత్సవాలు ప్రారంభం
నిజామాబాద్ రూరల్: నగరంలో జెండా బాలాజీ ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అనాధిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం అర్చకుడు అజయ్ సంగ్వాయ్ జెండాకు ప్రత్యేక పూజలు చేశారు. శతాబ్దానికి పైగా ఘన చరిత్ర ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడి ఉత్సవ విగ్రహాలను స్థానిక బాసింగ్‌బాబా ఆలయానికి తీసుకొచ్చి వేదపండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు చేపట్టారు. మేళతాళాలతో బయలుదేరి జెండా గల్లీలోని జెండా బాలాజీ ఆలయానికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఆలయంలో 15 రోజుల పాటు జాతర జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు శ్రీనివాసుడిని, జెండాను దర్శించుకోవాలని, నిత్యం ప్రత్యేక పూజలతో పాటు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లవంగ ప్రమోద్ కుమార్, ఆలయ కార్యనిర్వాహణాధికారి గింజుపల్లి వేణు, ఆలయ అర్చకులు నాగరాజు, జూనియర్ అసిస్టెంట్ ప్రశాంత్ కుమార్, ధర్మకర్తలు లక్ష్మణ్, దేవిదాస్, నర్సింగ్ రావు, కిరణ్ కుమార్, విజయ రాజ్ కుమార్, భక్తులు పాల్గొన్నారు.