
సౌర వెలుగుల నడ్కుడ
ఆదర్శంగా నిలుస్తున్న జీజీ నడ్కుడ
గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్
డొంకేశ్వర్(ఆర్మూర్): పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని బాపూజీ అన్న మాటలను నిజం చేస్తోంది మండలంలోని గంగగడ్డ (జీజీ) నడ్కుడ గ్రామం. బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొంది స్వాతంత్య్ర ఫలాలు ఇంటింటికీ అందుతున్న గ్రామంగా గుర్తింపు పొందుతోంది. గ్రామంలో ఇప్పటికే ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందుతుండగా, సొలార్ వినియోగంలో ఆదర్శంగా నిలుస్తోంది. ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ను ఆనుకొని ఉన్న ఈ మారుమూల పల్లె మూడేళ్ల క్రితమే సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. గ్రామ పంచాయతీలకు భారీ విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో జిల్లాలో జీజీ నడ్కుడ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సోలార్ సిస్టంను ఏర్పాటు చేశారు. అప్పట్లో కలెక్టర్‌గా పనిచేసిన నారాయణ రెడ్డి ‘గ్రీన్ విలేజ్’ పేరిట దీనికి శ్రీకారం చుట్టారు. మొత్తం ఆరుచోట్ల సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయగా, రూ.13లక్షల వరకు ఖర్చయింది. నిర్వహణ మొత్తం గ్రామ పంచాయతీ చూస్తుండగా, జీపీకి సంబంధించిన బోరు మోటార్లు, వీధి దీపాలకు ‘సౌర’ విద్యుత్‌ను వాడుతున్నారు. సోలార్ సిస్టం ఏర్పాటుకు ముందు జీపీకి ప్రతినెలా రూ.లక్షకు పైగా విద్యుత్ బిల్లు వచ్చేది. ఇప్పుడు సగం మాత్రమే వస్తోంది. సోలార్ సిస్టంతో విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకున్న జీజీనడ్కుడ బాటలోనే జిల్లాలోని మరిన్ని జీపీలు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సౌర యూనిట్ల ఏర్పాటుకు ముందు విద్యుత్ బిల్లులు భారీగా వచ్చేవి. మూడేళ్ల నుంచి సోలార్ కారణంగా బిల్లుల భారం తగ్గింది. సోలార్ ద్వారా గ్రామంలోని విద్యుద్దీపాలు, బోరు మోటార్లను వినియోగిస్తున్నాం.
– సుప్రియ, పంచాయతీ కార్యదర్శి, జీజీ నడ్కుడ

సౌర వెలుగుల నడ్కుడ