నిర్లక్ష్యపు నీడలో బాల్కొండ ఖిల్లా..!
● ఆనవాళ్లు కోల్పోతున్న వైనం
● శిథిలావస్థకు చేరుతున్న కోట గోడలు
● పట్టించుకోని పురావస్తు శాఖ
బాల్కొండ: బాల్కొండ ఖిల్లా నిర్లక్ష్యపు నీడలో మగ్గుతోంది. ఖిల్లా ఆనవాళ్లను కోల్పోయే పరిస్థితి దాపురించింది. బాల్కొండలో క్రీ.శ 1059వ సంవత్సరంలోనే మల్లయోధులు అల్లయ్య, కొండలు పాలించిన సమయంలో బాల్కొండ ఖిల్లాను నిర్మించినట్లు పూర్వీకులు చెబుతున్నారు. తరువాత బహమనీ సుల్తానుల నుంచి కాకతీయ రాజుల వరకు బాల్కొండ(అల్లకొండ)ను పాలించారు. ఆ సమయంలో బాల్కొండ ఖిల్లాను 40 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఖిల్లా ప్రధాన ద్వారాలు, ఖిల్లాలో ఆలయాలు, కొనేరు, అత్తా కోడళ్ల బావి, సొరంగ మార్గాలున్నాయి. అంతే కాకుండా ఫిరంగులు, మందు పాతరలను భద్రపరిచే ఆనవాళ్లు ఉన్నాయి. వాటికి మరమ్మతులు చేయకపోవడంతో కూలిపోయే స్థితిలో ఉన్నాయి. ఖిల్లాతో పాటు బాల్కండ గ్రామం నాలుగు వైపుల ప్రవేశ ద్వారాలు కూడ ఉన్నాయి. కాని అందులో మూడు ప్రవేశ ద్వారాలు శిథిలాస్థకు చేరడంతో కూల్చివేశారు. ప్రస్తుతం ఆర్మూర్ గైనిలో ఒక ద్వారం ఉంది. సంవత్సారల తరబడి ఖిల్లాను పట్టించుకోక పోవడంతో ఖిల్లా అభివృద్ధికి నోచుకోవడం లేదు.
మొద్దు నిద్రలో పురావస్తు శాఖ..
బాల్కొండ ఖిల్లాను పురావస్తు శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఖిల్లాను అభివృద్ధి చేయాలని ఖిల్లా పరిరక్షణ సమితి సభ్యులు పలు మార్లు పీఎంవో, సీఎంకు వినతి పత్రాలు ఇచ్చారు. కాని ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఖిల్లాపై పెరిగిన పిచ్చి మొక్కలను కూడా తొలగించలేని దుస్థితితో శాఖ ఉంది. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో తొలిగించాలని స్థానిక అధికారులకు కూడా వినతి పత్రం అందించారు. కాని వారు సైతం పట్టించు కోవడం లేదు.
పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం..
బాల్కొండ ఖిల్లాను అభివృద్ధి చేస్తే పర్యాటకంగా వెలుగొందే అవకాశం ఉంది. బాల్కొండ ఖిల్లాపై అత్త కోడళ్ల బావి ఉంది. ఆ బావిలో ఓ వైపు ఉప్పు నీరు, మరో వైపు మంచి నీరు ఉంటుంది. ఉప్పు నీరు ఉన్న బావిని అత్త, మంచి నీరు ఉన్న బావిని కోడలు బావిగా పిలుస్తున్నారు. అలానే శివలింగం ఉంది. అల్లయ్య, కొండయ్యల విగ్రహాలు చేతులు, కాళ్లు నరికి వేసినవిగా ఉంటాయి. ఖిల్లాకు పైభాగాన చెరువు, కింది వైపు పచ్చని పొలాలు ఉన్నాయి. పాలకులు స్పందించి వెంటనే అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఖిల్లాను అభివృద్ధి చేయాలి
బాల్కొండ ఖిల్లాను అభివృద్ధి చేయాలి. ఖిల్లా ప్రాంతంలో అనేక ప్రాచీ న కోటలు ఉన్నాయి. వాటన్నింటికి మరమ్మతులు చేపడితే అనేక మంది పర్యాటకులు వస్తారు. ప్రాచీన విషయాలు తెలుస్తాయి. ఖిల్లా వివరాలను భవిష్యత్తు తరాలకు అందించాలి.
– రాజేశ్వర్, గ్రామస్తుడు
ప్రధానికి విన్నవించాం
బాల్కొండ ఖిల్లాకు మరమ్మతులు చేపట్టి, అభివృద్ధి చేయాలని పీఎంవో కార్యాలయంలో ప్రధానికి విన్నవించాం. సీఎంవోలో సీఎంకు విన్నవించాం. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఉపాధి కూలీలతో పిచ్చి మొక్కలను కూడా తొలిగించడం లేదు. ప్రభుత్వం స్పందించి ఖిల్లాను అభివృద్ధి చేయాలి.
– నర్సింగ్‌రావు, ఖిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షుడు
నిర్లక్ష్యపు నీడలో బాల్కొండ ఖిల్లా..!
నిర్లక్ష్యపు నీడలో బాల్కొండ ఖిల్లా..!
నిర్లక్ష్యపు నీడలో బాల్కొండ ఖిల్లా..!
నిర్లక్ష్యపు నీడలో బాల్కొండ ఖిల్లా..!
నిర్లక్ష్యపు నీడలో బాల్కొండ ఖిల్లా..!


