భైంసాటౌన్: ప్రతినెలా ప్రభుత్వం అందించే పింఛన్‌పై ఆధారపడి జీవించేవారు జిల్లాలో ఎంతోమంది ఉన్నారు. అయితే, ఒక ఇంట్లో ఒకరికే పింఛన్ ఇస్తుండడంతో పింఛన్ పొందుతున్న భర్త మరణించిన సందర్భంలో అతనిపై ఆధారపడిన భార్య, పిల్లలు ఆర్థికంగా ఇబ్బంది పడేవారు. ఇదివరకు వృద్ధాప్య పింఛన్ పొందుతున్న భర్త మరణిస్తే అతని భార్యకు మాత్రమే తక్షణం పింఛన్ మంజూరు చేసే నిబంధనలుండేవి. మిగతా కేటగిరీలకు ఈ అవకాశం లేకపోవడంతో బాధితులు పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటివారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. చేయూత పథకం కింద వృద్ధాప్య పింఛన్ పొందుతున్న భర్త మరణిస్తే అతని భార్యకు తక్షణ పింఛన్ మంజూరు చేసే అవకాశాన్ని విస్తరించి దివ్యాంగులు, గీత, చేనేత, డయాలసిస్, హెచ్‌ఐవీ, ఫైలేరియా పింఛన్‌దారులకూ వర్తింపజేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో పింఛన్ పొందుతూ మృతి చెందిన వారి భార్యలకు ఇకపై తక్షణ పింఛన్ మంజూరు కానుంది.
నూతన మార్గదర్శకాలు ఇలా..
దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత, డయాలసిస్, ఫైలేరియా కేటగిరీల కింద పింఛన్ పొందుతున్న లబ్ధిదారు మరణిస్తే అతని భార్యకు తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భార్య వయస్సు 57 ఏళ్లపైబడి ఉంటే వృద్ధాప్య పింఛన్, అంతకంటే తక్కువ ఉంటే వితంతు పింఛన్ మంజూరు చేస్తారు. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శిని, పట్టణాల్లో బిల్ కలెక్టర్‌ను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
భర్త మరణించిన సందర్భంలో జీవించి ఉన్న భార్య కింద సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ, మరణించిన పెన్షనర్ ఆధార్ కార్డు, మరణించిన పెన్షనర్ డెత్ సర్టిఫి కెట్ దరఖాస్తుకు జత చేయాలి.
దరఖాస్తును పరిశీలించి, చేయూత పోర్టల్ ద్వారా సంబంధిత ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్/తహసీల్దార్, డీఆర్డీవో/కలెక్టర్ ఆమోదంతో పింఛన్ పింఛన్ మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని జారీ చేసిన ఉత్వర్లుల్లో ప్రభుత్వం పేర్కొంది.
జిల్లాలో కేటగిరీల వారీగా పింఛన్లు
వృద్ధాప్య 33.233
ఒంటరి మహిళ 2,082
వితంతు 35,354
దివ్యాంగులు 9,815
గీత కార్మికులు 264
చేనేత కార్మికులు 48
డయాలిసిస్ 152
ఫైలేరియా 220
బీడీ కార్మికులు 61,763
మొత్తం 1,43,652


