మహిషాసురుడిని సంహరించి.. గట్టు మైసమ్మగా కొలువై.. దేవీ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు.. తొమ్మిది రోజుల దీక్షలు చారిత్రక నేపథ్యం నుంచి ఆధ్యాత్మిక వైభవం వరకు భైంసా
మరాఠీ పురాణ గాథల ప్రకారం, ప్రాచీన కాలంలో భైంసా ప్రాంతాన్ని మాహిష్మతి నగరంగా పిలిచేవారు. మహిషాసురుడి ఆగడాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు మాహీషమ్మను ప్రార్థించారు. అమ్మ ప్రత్యక్షమై మహిషాసురుడిని సంహరించిందన్నది ఈ ప్రాంతంలోని ప్రధాన గాథ. ఈ సంఘటన అనంతరం అమ్మవారు ఇక్కడే కొలువైందని భక్తులు విశ్వసిస్తారు. మాహీషా, మైసా వంటి పేర్ల నుంచి క్రమేణా భైంసాగా పేరు స్థిరపడిందని స్థానిక కథనాలు వివరిస్తున్నాయి.
భైంసా: నిర్మల్ జిల్లా భైంసా.. తరతరాలుగా కొనసాగుతున్న భక్తి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. ఒకవైపు పట్టణ చరిత్రను గుర్తుచేసే పురాణ గాథలు, మరోవైపు దుర్గాదేవి మైసమ్మకు నిర్వహించే ప్రత్యేక పూజలు, నవరాత్రుల్లో భక్తులు చేపట్టే దీక్షలు, తుల్జాపూర్ వరకు సాగే మహాపాదయాత్ర.. భైంసా ఆధ్యాత్మిక ప్రత్యేకతను చాటుతున్నాయి.
నవరాత్రుల్లో ప్రత్యేక దీక్షలు..
చదువుల తల్లి సరస్వతీదేవి కొలువైన బాసరకు సమీపంలో ఉన్న భైంసాలో దుర్గాదేవిని మైసమ్మగా కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పట్టణానికి చెందిన రామ్‌లాల్ కుటుంబీకులు దశాబ్దాలుగా అమ్మవారి సేవలో కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దసరా నవరాత్రులు ప్రారంభం కాగానే పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. వీధుల్లో దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యువకులు అమ్మవారి దీక్షలు స్వీకరించి తొమ్మిది రోజులపాటు నియమ నిష్ఠలతో గడుపుతారు. గట్టు మైసమ్మ, దుర్గాదేవి ఆలయాల్లో సాయంత్రం, సంధ్యా వేళల్లో పూజలు నిర్వహిస్తూ అమ్మవారిని ఆరాధిస్తారు.
తుల్జాపూర్‌కు మహాపాదయాత్ర..
నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తర్వాత అమ్మవారి దీక్షలు పూర్తి చేసుకున్న మాలాధారులు మహాపాదయాత్ర చేపట్టడం మరో విశేషం. భైంసా నుంచి మహారాష్ట్రలోని తుల్జాపూర్ వరకు సుమారు 372 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన చేరుకుంటారు. ‘జై మాతా ది’ నినాదాలతో ముందుకు సాగే భక్తులకు మార్గమధ్యంలోని గ్రామాల ప్రజలు స్వాగతం పలుకుతారు. భోజన ఏర్పాట్లు చేస్తూ తమ వంతు సేవ అందిస్తారు. తుల్జాపూర్‌లోని భవానీమాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న తర్వాత తిరుగు ప్రయాణమవుతారు. ఛత్రపతి శివాజీ మహారాజుకు భవానీమాత ఖడ్గాన్ని ప్రసాదించిందనే విశ్వాసం ఈ యాత్రకు మరింత ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని చేకూరుస్తోంది.
భావితరాలకు అందించాల్సిన వారసత్వం..
భైంసా చరిత్ర కేవలం గతానికి సంబంధించినది మాత్రమే కాదు. స్థానికుల ఆచారాలు, విశ్వాసాలు, పండుగలు, సామూహిక జీవన సంప్రదాయాలకు అద్దం పట్టే వారసత్వం. గట్టు మైసమ్మ ఆల యం, నవరాత్రి దీక్షలు, మహాపాదయాత్ర వంటి సంప్రదాయాలను సమగ్రంగా నమోదు చేయడంతోపా టు మరాఠీ పురాణాల్లోని గాథలను పరిశోధించి తెలుగు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.


