భైంసా : ఆదిశక్తి ఆరాధనతో, అమ్మవారి నామస్మరణతో, భక్తుల ఆధ్యాత్మిక చింతనతో బాసర పుణ్యక్షేత్రం భక్తిభావంలో మునిగిపోయింది. తొమ్మిది రోజులు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగిన శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. నవరాత్రుల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అమ్మవారి అలంకరణలు, భక్తుల పాదయాత్రలు, దీక్షలు పుణ్యక్షేత్రానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చాయి. మంగళవారం నిర్వహించనున్న రథోత్సవంతో నవరాత్రి వేడుకలు ముగియనున్నాయి.
తొమ్మిది రోజులు పాదయాత్ర
అమ్మవారిపై అచంచలమైన భక్తితో పలువురు భక్తులు తొమ్మిది రోజులు పాదయాత్ర నిర్వహించారు. అమ్మవారి నామస్మరణ చేస్తూ సాగిన వారి యాత్ర భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక నిబద్ధతకు ప్రతీకగా నిలి చింది. కష్టాలను అధిగమించి అమ్మవారి ఆశీస్సులు పొందాలనే సంకల్పంతో భక్తులు పాదయాత్రలో పాల్గొన్నారు. మరోవైపు అమ్మవారి దీక్ష స్వీకరించిన వారు నియమనిష్టలతో పూజలు నిర్వహిస్తూ నవరాత్రి ఆరాధనలో భాగస్వాములయ్యారు.
తొలిసారి బాలాలయంలో..
ఈ ఏడాది నవరాత్రి వేడుకలు బాలాలయంలో ఉత్సవాలు నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది. తొలిసారిగా బాలాలయంలో జరిగిన నవరాత్రి పూజలు భక్తుల్లో ఆసక్తిని కలిగించాయి. అమ్మవారి ఆరాధనకు ప్రాధాన్యమిస్తూ నిర్వహించిన పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాల కోసం ప్రార్థించారు.
నేడు రథోత్సవం..
నవరాత్రి ఉత్సవాల ముగింపు పురస్కరించుకుని బాసరలో రథోత్సవం నిర్వహించనున్నారు. తొమ్మి ది రోజులపాటు అమ్మవారి ఆరాధనలో మునిగిపోయిన భక్తులకు రథోత్సవం మరో ఆధ్యాత్మిక వేడుకగా నిలవనుంది. అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజలతో పాటు రథోత్సవంలో పాల్గొని ఆశీస్సులు పొందేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.
మహర్నవమికి పోటెత్తిన భక్తులు
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీదేవి ఆలయానికి సోమవారం మహర్నవమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. రద్దీ పెరగడంతో ఆలయ పరిసరాలు భక్తజనసందోహంగా మారాయి. సాధారణ దర్శనానికి గంటకుపైగా సమయం పట్టిందని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లలో తాగునీరు, ఇతర కనీస వసతులు ఏర్పాటు చేశారు.
నేటి పూజలు..
విజయ దశమి సందర్భంగా మంగళవారం ఉదయం ఆలయంలో నవచండీ మహా పూర్ణాహుతి, అమ్మవార్లకు విశేష అభిషేకం, మహాపూజ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుంది. అనంతరం శమీ పూజ(జమ్మి పూజ), ప్రత్యేక నైవేద్యము, మహా హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలతో శరన్నవరాత్రి మహోత్సవాలు ముగుస్తాయి.


