సాత్నాల: రైతుల ఆత్మహత్యలు వారిపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. భోరజ్ మండలంగూడ గ్రామానికి చెందిన రైతు పాతాని రవి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా సోమవారం రిమ్స్ ఆస్పత్రిలో ఆయన మృతదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు లేక పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టాలు, అప్పుల భారాన్ని తట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పాతాని రవి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


