నిర్మల్: ఒకవైపు శరన్నవరాత్రి పూజలతో నిండుగా భక్తి.. మరోవైపు పూల పండుగ, ఆడపడుచుల బతుకమ్మ ఆటపాటలతో మహిళల సందడితో వారం రోజులుగా జిల్లా రోజూ పండుగ చేసుకుంటోంది. ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. ఏ గల్లీకి వెళ్లినా దుర్గమ్మ దర్శనమిస్తోంది. పూజలు, అన్నదానాలతో నిత్యం పండుగ వాతావరణం తలపిస్తోంది. సాయంత్రం దుర్గమ్మకు బతుకమ్మ తోడవుతోంది. ఆడపడుచులంతా కలిసి పూజలు పూర్తిచేసుకుని బతుకమ్మ ఆడుతూ పండుగను రెట్టింపు చేస్తున్నారు. వీటికి తోడుగా శనివారం నుంచి అడెల్లి పోచమ్మ గంగనీళ్ల జాతర మొదలవుతోంది. రెండు రోజులపాటు పల్లెల్లో మరింత కోలాహలం పెంచనుంది. ఈ పండుగలు ప్రజల్లో ఐక్యతను పెంచు తూ సమష్టితత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.
దరిచేరుస్తున్న దుర్గమ్మ
శరన్నవరాత్రుల సందర్భంగా పట్టణాలు, గ్రామాల్లో అమ్మవారి మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలు స్తున్నాయి. భక్తులు అమ్మవాకి వివిధ రూపాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు, హారతులు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటోంది.
బతుకమ్మ తోడుగా
పొద్దంతా దుర్గమ్మ పూజల్లో నిమగ్నమైన ఆడపడుచులకు సాయంత్రం బతుకమ్మ తోడవుతోంది. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదా య వస్త్రధారణలో ఆడపడుచులు ఒకచోట చేరుతున్నారు. పాటలు పాడుతూ ఆడుతున్నారు. రంగుల పూల పరిమళాలు, మహిళల కోలాటాలతో పండుగ కళ రెట్టింపవుతోంది. దుర్గమ్మ వద్ద భక్తి పారవశ్యం కనిపిస్తుండగా, బతుకమ్మ వద్ద తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిస్తున్నాయి.
సమష్టితత్వం పెంచేలా
శరన్నవరాత్రులు, బతుకమ్మ ఆటలు, గంగనీళ్ల జా తరలు వేర్వేరుగా కనిపించినా, వీటి వెనుక ఉన్నది భక్తి, ప్రకృతిపై ప్రేమ, సమాజంతో మమేకమయ్యే తత్వమే. ఒకవైపు అమ్మవారి ఆరాధన, మరోవైపు పూల పండుగ, ఇంకోవైపు స్థానిక దేవతల జాతరలు.. ఇలా జిల్లాలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభ వం వెల్లివిరుస్తోంది. పూజలు, పాటలు, పూలు, ప్ర సాదాలతో జిల్లాలో రోజంతా పండుగ వాతావరణం కనిపిస్తోంది.
గంగనీళ్ల జాతరకు ముస్తాబైన సాంగ్వి ఆలయం
సారంగాపూర్‌లో దుర్గామాతకు బోనాలు..
పల్లెలు కదలంగ.. గంగనీళ్ల జాతర
‘పోదాం పా.. గడముంతలతో గంగనీళ్ల జాతరకు.. మొక్కి వద్దం పా.. అడెల్లి పోచమ్మ తల్లిపాదాలకు..’ అంటూ జిల్లాలోని పల్లెలు గంగనీళ్ల జాతరకు సిద్ధమయ్యాయి. శని, ఆదివారాలు అడెల్లి పోచమ్మ నగలతో సాగే ఈ జాతరలో ఊళ్లన్నీ భాగం కానున్నాయి. అడెల్లి నుంచి సంగెం దాకా, మళ్లీ సంగెం నుంచి అడెల్లి పోచమ్మ దాకా దారి పొడవునా అమ్మవారి నగలను దర్శించుకునేందుకు, మొక్కులు తీర్చుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే సారంగపూర్, దిలావర్‌పూర్ మండలాల్లోని గ్రామాలు జాతర ఏర్పాట్లు పూర్తిచేసుకున్నాయి.


