● జిల్లా జడ్జి ఎస్.శ్రీవాణి
నిర్మల్‌టౌన్: సీనియర్ సిటిజన్లు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా జడ్జి ఎస్.శ్రీవాణి సూచించారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్‌లో గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని సూచించా రు. కుటుంబ సభ్యులు కూడా వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు సీనియర్ సిటిజన్లకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలపై సూచనలు అందించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యాయ సహాయ కేంద్రాన్ని జిల్లా జడ్జి ప్రారంభించారు. ప్రజలకు న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు ఉచిత న్యాయ సహాయం, అవసరమైన సూచనలు అందేలా కేంద్రం పనిచేయాలన్నారు.


