గటెట్‌క్కిన టీచర్లు! | - | Sakshi
Sakshi News home page

గటెట్‌క్కిన టీచర్లు!

Oct 2 2026 5:20 AM | Updated on Oct 2 2026 5:20 AM

● ప్రత్యేక టెట్‌లో 65 శాతంపైగా అర్హత... ● క్వాలిఫైతో ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల ఊరట

నిర్మల్‌ఖిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఉపాధ్యాయులు మళ్లీ టెట్‌ రాయాల్సి రావడంతో ఆందోళన చెందారు. పరీక్ష రాసిన త ర్వాత ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూశా రు. తాజాగా ఫలితాలు విడుదల కావడంతో అర్హత సాధించిన వారు ‘‘హమ్మయ్యా... పాస్‌ అయ్యాం’’ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్‌ను నిర్వహించింది. సెప్టెంబర్‌ 8, 9 తేదీల్లో కంప్యూటర్‌ విధానంలో పరీక్షలు జరిగాయి. సెప్టెంబర్‌ 26న ఫలితాలు విడుదలయ్యాయి.

జిల్లాలో భారీ స్పందన

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల నుంచి ప్రత్యేక టెట్‌కు విశేష స్పందన లభించింది. జిల్లాలో సుమారు 2,640 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. గత టెట్‌లో 1,200 మందికిపైగా ఉత్తీర్ణులయ్యారు. తాజాగా ప్రత్యేక టెట్‌కు 852 మంది హాజరయ్యారు. 553 మంది అర్హత సాధించారు. దాదాపు 65 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పేపర్‌–1, పేపర్‌–2 కలిపి ఇప్పటివరకు 1,800 మందికి పైగా క్వాలిఫై అయినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

నవంబర్‌లో మరో అవకాశం..

ప్రత్యేక టెట్‌లో అర్హత సాధించలేకపోయిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించనుంది. ఇన్‌సర్వీస్‌ టీచర్స్‌–2 పేరుతో మరో ప్రత్యేక టెట్‌ను నవంబర్‌లో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అక్టోబర్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల చేసి, నవంబర్‌ 16 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించే ప్రతిపాదన ఉందని టెట్‌ కన్వీనర్‌ ఇటీవల వెల్లడించారు.దీంతో ప్రస్తుత పరీక్షలో అర్హత సాధించని నిర్మల్‌ జిల్లా ఉపాధ్యాయులకు మరోసారి తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం లభించనుంది.

అర్హత తప్పనిసరి

ఉద్యోగంలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల కు టెట్‌ అర్హత తప్పనిసరి కావడంతో ఈ పరీ క్ష సాధారణ పరీక్ష కంటే కీలకమైంది. పరీక్షకు ముందు సిలబస్‌ను మరోసారి సమీక్షించి, మోడల్‌ పేపర్లు, పాత ప్రశ్నపత్రాలు, ఆన్‌లైన్‌ మెటీరియల్‌ సహాయంతో సిద్ధమయ్యారు. ఫలితాలు వెలువడిన వెంటనే హాల్‌టికెట్‌ నంబర్‌, వివరాలు పరిశీలించుకుని అర్హత నిర్ధారణ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement