నిర్మల్‌టౌన్: పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు జిల్లా కేంద్రంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా సూచించారు. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ఎస్పీ జానకీషర్మిలతో కలిసి ఉచిత పోలీసు శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు తీవ్ర పోటీ ఉందని, కృత్రిమ మేధ(ఏఐ) విస్తరిస్తు న్న నేపథ్యంలో ఉద్యోగం సాధించడం సవాల్‌గా మారిందన్నారు. హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందడం అభ్యర్థులకు ఖర్చుతో కూడుకున్నదని, జిల్లా కేంద్రంలోనే ఉచిత శిక్షణ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. అభ్యర్థులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంటూ కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు వసతి కల్పనలో సహకరిస్తామని తెలిపారు.
పోలీసు ఉద్యోగమే లక్ష్యంగా ముందుకు సాగాలి
పోలీసు ఉద్యోగమే లక్ష్యంగా అభ్యర్థులు పట్టుదలతో శ్రమించాలని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. ఉచిత శిక్షణ కోసం దాదాపు 300 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారని తెలిపారు. అభ్యర్థులకు అల్పాహారంతోపాటు ఒకపూట ఉచిత భోజనం, అవసరమైన ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. సుదూర ప్రాంతాల విద్యార్థులకు వసతి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందించడంతోపాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. బోధన అనుభవం ఉన్న పోలీసు సిబ్బంది కూడా తరగతులు నిర్వహిస్తారన్నారు. రెండురోజులకోసారి పరీక్షలు నిర్వహించి అభ్యర్థుల ప్రతిభను పరిశీలిస్తామని చెప్పారు. ఫిజికల్ ఈవెంట్స్‌కు అవసరమైన శిక్షణ కూడా అందిస్తామన్నారు. అభ్యర్థులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే సిబ్బంది దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయికిరణ్, డీఎస్పీ శ్రీనివాస్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


